రాంచీ : అక్రమ మద్యం సరఫరా జరుగుతుందని సమాచారం అందుకొని రైడింగ్‌కు వెళ్లిన పోలీసులు అనుకోకుండా క్వారంటైన్ సెంటర్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటన జార్ఖండ్‌లోని కోడెర్మా జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు.. జూలై 4(శనివారం) అక్రమ మద్యం సరఫరా జరుగుతుందని కోడెర్మా పోలీస్ స్టేషన్‌కు సమాచారమందింది. దీంతో డీఎప్సీ ఆధ్వర్యంలో జయ్ నగర్, చాంద్‌వారా పోలీస్ స్టేషన్‌కు చెందిన మొత్తం 42 మంది పోలీసులు రెండు బృందాలుగా విడిపోయి అక్రమ మద్యం సరఫరా జరుగుతున్న ప్రదేశంలో రైడింగ్ నిర్వహించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా జైలుకు తరలించే ముందు పోలీసులు ఇద్దరు నిందితులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే నిందితుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు మంగళవారం వచ్చిన రిపోర్టులో తేలింది. (కరోనా వ్యాక్సిన్ : సినోవాక్ కీలక ప్రకటన)
దీంతో అప్రమత్తమైన పోలీస్ శాఖ పాజిటివ్ వచ్చిన నిందితుడిని ఆసుపత్రికి తరలించారు. కాగా రైడింగ్‌కు వెళ్లిన డీఎస్పీ సహా 42 మంది పోలీసులను, మరొక నిందితుడిని దోమచాంచ్ క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. కాగా ఈ విషయమై కోడెర్మా డిప్యూటీ కమిషనర్ రమేశ్ గోలప్ స్పందిస్తూ.. 'రైడింగ్‌కు రెండు బృందాలుగా మొత్తం 42 మంది పోలీసులు వెళ్లారు. అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితుల్లో ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాం. ముందస్తుగా వారందరిని మేము ఏర్పాటు చేసుకున్న క్వారంటైన్ సెంటర్‌కు తరలించాం. ప్రస్తుతం వారంతా బాగానే ఉన్నారు. అందరికి కరోనా పరీక్షలు నిర్వహించాం. కరోనా వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నా వైరస్ ఉదృతి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాం'అంటూ తెలిపారు.
మరోవైపు ఇప్పటికే జయనగర్, చాంద్‌వారో పోలీస్ స్టేషన్లకు సాధారణ ప్రజలు రాకుండా గట్టి భద్రతా చర్యలు తీసుకున్నట్లు డీసీపీ తెలిపారు. అయితే గత నాలుగు రోజులగా ఫిర్యాదుల కోసం పోలీస్ స్టేషన్‌కు వచ్చిన వారు స్వచ్చందంగా ముందుకు వచ్చి కరోనా పరీక్షలు నిర్వహించుకోవాలని ఇప్పటికే అధికారిక ప్రకటన జారీ చేసినట్లు డీసీపీ పేర్కొన్నారు. కాగా జార్ఖండ్‌లో ఇప్పటివరకు 2,781 కరోనా కేసులు నమోదవ్వగా.. 19 మంది మృతి చెందారు
Comments
Please login to add a commentAdd a comment