
బిహార్‌లో ప్రకృతి విలయం
పిడుగులు, భారీ వర్షాలకు 57 మంది మృతి
పట్నా/లక్నో: బిహార్‌లో మంగళ, బుధవారాల్లో పిడుగులు, భారీ వర్షాల ధాటికి 57 మంది మంది మృతిచెందారు. పిడుగుపాట్లకు మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో పలువురు మహిళలు, పిల్లలు ఉన్నారు. దాదాపు 17 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. పట్నా జిల్లాలో ఆరుగురు, బక్సర్‌లో ఐదుగురు, నలంద, భోజ్‌పూర్, రోహ్తాస్, కైమూర్, ఔరంగాబాద్, పూర్ణియా జిల్లాలో నలుగురు చొప్పున మృతిచెందారు. కతియార్, సహస్ర, సరణ్ జిల్లాల్లో ముగ్గురు చొప్పున చనిపోయారు. ముంగేర్, సమస్తిపూర్, భాగల్పూర్‌లలో ఇద్దరు, బంకా, మాధేపురా, ముజఫర్‌పూర్, పశ్చిమ చంపారన్ జిల్లాల్లోనూ ఒకరు చొప్పున మరణించారని రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగ ముఖ్య కార్యదర్శి వ్యాసాజీ తెలిపారు.
పూర్ణియా జిల్లాలో 97.2మిల్లీమీటర్లు, గయలో 62.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. మరోపక్క.. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్, బలియా జిల్లాల్లో మంగళవారం పిడుగులు పడి తొమ్మిది మంది బాలలు సహా 13 మంది మృతిచెందారు. జార్ఖండ్ చాత్రా జిల్లా హదియాతాంద్‌లో పిడుగుపాటుకు ఒకే కుటుంబంలోని నలుగురు మృతిచెందారు.
ప్రధాని సంతాపం..బిహార్, యూపీ తదితర రాష్ట్రాల్లో వర్షాలు, పిడుగుపాట్లలో జరిగిన ప్రాణనష్టంపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆప్తులను కోల్పోయిన వారికి ట్విటర్‌లో సంతాపం తెలిపారు.