
రోజూ ఓ ఫుల్లేస్కో.. 60 సిగరెట్లు తాగు.. ఏంకాదు
న్యూఢిల్లీ: ఓ పక్క ఆరోగ్యమే మహాభాగ్యం.. అందుకు స్వచ్ఛ భారత్ అంటూ తమ అధినేత, ప్రధాని నరేంద్రమోదీ వరుసగా స్పీచ్లు ఇస్తుండగా వాటన్నింటిని ఖాతరు చేయకుండా బీజేపీ నేతలు మాత్రం విరుద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారు. పొగ తాగడం వల్ల ఎలాంటి ప్రమాదం రాదని, క్యాన్సర్ సోకదంటూ చెప్తోన్న బీజేపీ నేతల పక్కన తాజాగా మరో నేత చేరాడు. 'రోజూ ఫుల్ బాటిల్ ఆల్కహాల్, 60 సిగరెట్లు తాగే వ్యక్తులు నాకు తెలుసు. వాళ్లలో ఓ వ్యక్తి 86 ఏళ్లకు చనిపోయాడు.
మరొకరు ఇప్పటికీ బతికి ఉన్నాడు. పొగతాగడం వల్ల క్యాన్సర్ వస్తుందనే వాళ్లంతా ఈ విషయాన్ని గమనించాలి' అంటూ అసోంకు చెందిన బీజేపీ ఎంపీ రామ్ ప్రసాద్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పొగ తాగడంవల్ల క్యాన్సర్ వస్తుందనే విషయం అసలు చర్చించదగిన అంశమే కాదంటూ కొత్తగా సూచించారు. దీంతో పొగాకు ఉత్పత్తుకు మద్దతు తెలిపేలా వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతల్లో శర్మ మూడో వ్యక్తిగా నిలిచారు. అంతేకాదు, ఇప్పటివరకు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వీరు ముగ్గురు కూడా పొగ తాగడాన్ని తగ్గించేందుకు తీసుకురానున్న కొత్త విధానాన్ని సమీక్షించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులే కావడం గమనార్హం.
పొగాకు ఉత్పత్తులపై హెచ్చరిక చిహ్నాలను ముద్రిస్తూ ప్రచారం నిర్వహించే కార్యక్రమం ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి రావాల్సి ఉండగా వీరి సమీక్ష ఇంకా పూర్తికాలేదు. ఇప్పటికే, సిగరెట్ తాగితే కేన్సర్ వస్తుందని భారత్‌లో ఏ పరిశోధన కూడా ధ్రువీకరించలేదని, అలా అనుకోవటం మూర్ఖత్వమని బీజేపీ ఎంపీ దిలీప్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలకు మరుసటి రోజే డయాబెటిస్ వస్తుందని చక్కెరను నిషేధిస్తామా అంటూ బీజేపీకే చెందిన శ్యాం చరణ్ గుప్తా కూడా వివాదాస్పదంగా మాట్లాడారు.