
పొగరాయుళ్ల జేబుకు చిల్లు
దేశ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సిగరెట్ల మీద ప్రస్తుతమున్న 11 శాతం పన్నును ఒకేసారి 72 శాతానికి పెంచారు. పాన్ మసాలా, గుట్కాల మీద కూడా పన్నును 60 శాతానికి పెంచారు. దీంతో సిగరెట్ ప్యాకెట్లు, పాన్ మసాలాలు, గుట్కాలు.. వీటన్నింటి ధరలు అత్యంత భారీగా పెరగబోతున్నాయి. సిగరెట్ల మీద ధరలను పెంచాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇంతకుముందే ఆర్థిక మంత్రిని కోరింది. అదే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. ప్రజారోగ్యాన్ని పరిరక్షించే ఈ చర్యకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. వీటితో పాటు కూల్ డ్రింకులు, సోడాల మీద కూడా పన్నును పెంచారు.
దేశంలో కేన్సర్ కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో పాటు.. ప్రధానంగా పొగతాగేవాళ్లకే కేన్సర్, గుండెజబ్బుల లాంటివి వస్తున్నాయని వైద్యవర్గాలు ఎప్పటినుంచో చెబుతున్నాయి. అయినా పట్టణ, గ్రామీణ భారతాల్లో పొగాకు, పొగాకు ఉత్పత్తుల వాడకం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ప్రధానంగా యువత వీటిపై ఎక్కువగా మక్కువ పెంచుకుంటున్నారు. ఆర్థికమంత్రి మోగించిన మోతతో.. పొగాకు, పొగాకు ఉత్పత్తుల ధరలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. ఇప్పటికైనా వీటి వాడకాన్ని తగ్గిస్తే ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లు అవుతుంది.