సాక్షి, ముంబై: విమాన ప్రయాణ నిబంధనల గురించి ఏ మాత్రం అవగాహన లేని ఓ పెద్దాయన ..ఇబ్బందుల్లో పడ్డారు. అంతేకాదు తోటి ప్రయాణీకుల గుండెల్ని గుభేల్‌మనిపించారు కూడా. ఆయన చేసిన పనికి అకస్మాత్తుగా విమానంలో గందరగోళం, భయాందోళన వాతావరణం నెలకొంది. వెంటనే సిబ్బంది అప్రమత్తం కావడంతో పరిస్థితి సద్దు మణిగింది.
అసలు ఇంతకీ ఏం జరిగిందంటే హర్యానాలోని ఇజ్జర్ నివాసి రాజ్‌కుమార్ లక్ష్మీనారాయణ్ గార్గ్(65) మొదటిసారి విమానంలో ముంబై బయలుదేరారు. సమీప బంధువు అంత్యక్రియలకు హాజరయ్యే నిమిత్తం అత‍్యవసరంగా విమాన ప్రయాణాన్ని ఎంచుకున్నారు. తన కుటుంబసభ్యులతో కలిసి జనవరి 9న రాయ్‌పూర్ నుంచి ముంబైకి ఇండిగో విమానంలో (6ఈ-802) బయలుదేరారు. ఇంతలో బీడీ తాగాలన్న కోరికను నియంత్రించుకోలేని లక్ష్మీనారాయణ్...వెంటనే విమానంలోని టాయ్‌లెట్‌లోకి దూరి, పనికానివ్వడం మొదలుపెట్టారు. అంతే..విమానంలో ఫైర్ అలారంలు తమ పని కానిచ్చాయి. దీంతో విమానంలో ప్రయాణీకులు, సిబ్బంది తీవ్ర భయాందోళనతో వణికిపోయారు. సిబ్బంది పరిశీలనతో...పెద్దాయన వ్యవహారం బయటపడింది. వెంటనే వారు కెప్టెన్ రితేష్ మల్హోత్రాకు ఫిర్యాదు చేశారు. ఎయిర్‌లైన్స్ నియమాలు, నిబంధనలు గురించి ఆయనకు కెప్టెన్ వివరించారు. అనంతరం విమానం ముంబై చేరున్నాక.. విమానాశ్రయం పోలీసు స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్ 336, ఎయిర్‌లైన్ రూల్ ఆఫ్ 25ఎ కింద ఆయనపై కేసు నమోదు చేశారు. అయితే ఇవి బెయిలబుల్ సెక్షన్లు కావడంతో వెంటనే ఆయనకు బెయిల్ మంజూరైంది. దీంతో లక్ష్మీనారాయణ్, ఆయన కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment