గ్యాస్ ట్యాంకర్ పేలి 8 మంది సజీవ దహనం
ఠాణే జిల్లా డహాను తాలూకాలో గ్యాస్ ట్యాంకర్ శనివారం ప్రమాదానికి గురైంది. వాహనానికి నిప్పంటుకోవడంతో ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. చుట్టుపక్కలా ఎనిమిది వాహనాలు దగ్ధమయ్యాయి. ముంబై - అహ్మదాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.
ఘటనాస్థలి నుంచి సుమారు 150 మీటర్ల వరకు ముందుజాగ్రత్తగా ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం...మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిలో కాసా పోలీసు స్టేషన్ పరిధిలోని చారోటి ప్రాంతంలో గ్యాస్‌తో నిండిన ట్యాంకర్ బోల్తాపడింది. దీంతో ఆ ట్యాంకర్‌కు మంటలు అంటుకున్నాయి. అగ్ని కీలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. చుట్టుపక్కల పరిసరాల వరకు వ్యాపించాయి. అనేక వాహనాలు దగ్ధమయ్యాయి. ఇది తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనస్థలానికి చేరుకున్నారు.
సమీపంలోని షాపులు, ప్రజలను ఖాళీ చేయిం చారు. యుద్దప్రతిపాదికన మంటలను ఆర్పి క్షతగాత్రులను రక్షించేందుకు ప్రయత్నించారు. కానిస్టేబుల్‌తోపాటు పలువురికి గాయాలయ్యాయి.