ట్యాంకర్‌ను బయటకు లాగుతున్న దృశ్యం
కర్ణాటక: ధార్వాడ సమీపంలో భారీ ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్ అండర్‌పాస్ కింద ఇరుక్కుపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్రమైన ఆందోళన నెలకొంది. పోలీసులు, ఫైర్ సిబ్బంది జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేయడంతో డ్రైవర్లు, ప్రయాణికులు అవస్థలు పడ్డారు. 16 గంటలు శ్రమించి ట్యాంకర్‌ను బయటకు తీయడంతో హైడ్రామా సమాప్తమైంది.
ఏం జరిగిందంటే
వివరాలు... ధార్వాడ నగర సమీపంలో హైవే– 4లో హైకోర్టు బెంచ్ వద్ద ఒక అండర్ పాస్‌లో బుధవారం సాయంకాలం 7 గంటలప్పుడు ట్యాంకర్ చిక్కుకుపోయింది. ట్యాంకర్ డ్రైవర్ అవగాహన లేకుండా అవతలి వైపునకు వెళ్లగా, ట్యాంకర్ ఎత్తు ఎక్కువగా ఉండడంతో అండర్‌పాస్ పైకప్పుతో రాపిడి జరిగి ఇరుక్కుంది. డ్రైవర్ ఎంత ప్రయత్నించినా ముందుకు, వెనక్కు కదల్లేకపోయింది.
ముమ్మరంగా సహాయక చర్యలు
విషయం తెలిసిన తరువాత జిల్లాధికారులు, పోలీసులు, ఫైర్ సిబ్బంది క్రేన్లతో సహాయక చర్యలు ప్రారంభించారు. గ్యాస్ లీకై ఒక్క రవ్వ నిప్పు పడినా భస్మీపటలం సంభవిస్తుందనే భయం నెలకొంది. ముందు జాగ్రత్తగా చుట్టుపక్కల కరెంటును నిలిపివేశారు. ఎవరూ ఇళ్లల్లో అగ్గిపెట్టె వాడరాదని, వంటలు చేయరాదని ప్రకటించారు. బెళగావి నుంచి ధార్వాడకు వచ్చే వాహనాలను నిలిపివేశారు. వేరే ట్యాంకర్‌ను తెప్పించి అందులోకి గ్యాస్‌ను డంప్ చేశారు. తరువాత ఖాళీ ట్యాంకర్‌ను క్రేన్లతో బయటకు లాగారు. ప్రజలు సహకరించారని జిల్లా ఎస్పీ డాక్టర్.సంజీవ్ పాటిల్ తెలిపారు. మొత్తానికి 16 గంటల పాటు అందరిని టెన్షన్ పెట్టిన గ్యాస్ ట్యాంకర్ ఉదంతం గురువారం మధ్యాహ్నంకల్లా ముగియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గంటల కొద్దీ వాహనాలను బంద్ చేయడంతో ప్రజలు, ఉద్యోగులు కాలినడకన సంచరించారు. ఇళ్లల్లో ప్రజలు వంటలు చేసుకోక ఆకలి బాధ అనుభవించారు.
Comments
Please login to add a commentAdd a comment