కశ్మీర్‌లో ఉగ్రవాదుల పంజా
8 మంది జవాన్ల మృతి, 20 మందికి గాయాలు
జవాన్ల ఎదురుదాడిలో ఇద్దరు మిలిటెంట్ల హతం
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు శనివారం మరోసారి దాడులకు తెగబడ్డారు. దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా పాంపోర్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై కాల్పులు జరిపారు. ఫైరింగ్ ప్రాక్టీస్ ముగించుకొని తిరిగివస్తున ్న సీఆర్పీఎఫ్ జవాన్ల వాహనంపై ఇద్దరు ఉగ్రవాదులు దాడి చేశారు. ఎనిమిది మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందగా, మరో 20కిపైగా జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన జవాన్లను ఆర్మీ బేస్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. దాడులకు పాల్పడ్డ ఇద్దరు ఉగ్రవాదులను సీఆర్పీఎఫ్ జవాన్లు మట్టుబెట్టారు. సీఆర్పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ నలిన్ ప్రభాత్, జమ్మూ కశ్మీర్ డీజీపీ కె.రాజేంద్ర సంఘటనా ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులు లష్కరే తోయిబా గ్రూపుకు చెందిన వారుగా డీజీపీ అనుమానం వ్యక్తం చేశారు. సీఆర్పీఎఫ్ డెరైక్టర్ జనరల్ దుర్గాప్రసాద్ దాడి విషయాలను కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు వివరించారు. కశ్మీర్‌లో గత మూడు వారాల్లో జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాలపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడడం ఇది రెండోసారి.
బారాముల్లాలో ఇద్దరు ఉగ్రవాదుల హతం
మరోవైపు.. ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా లాచిపోరాలో శనివారం ఆర్మీ-ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.
ప్రధాని తీవ్ర సంతాపం
న్యూఢిల్లీ: కశ్మీర్‌లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఎనిమిది సీఆర్‌పీఎఫ్ జవాన్ల మృతిపై ప్రధానిమోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అమరులైన జవాన్ల ధైర్య సాహసాలకు సెల్యూట్ చేస్తున్నానన్నారు. దేశానికి ఎంతో అంకితభావంతో సేవలు చేశారని ట్వీట్ చేశారు. అమరుల కుటుంబాలకు సంతాపం ప్రకటించడంతో పాటు, గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.