అపర భగీరధుడు ఈ వాటర్ మేన్ | 84-Year-Old Padma Shri Simon Oraon is Jharkhand's Waterman | Sakshi
Sakshi News home page

అపర భగీరధుడు ఈ వాటర్ మేన్

Published Thu, Mar 31 2016 7:55 PM | Last Updated on Sun, Sep 3 2017 8:57 PM

అపర భగీరధుడు ఈ వాటర్ మేన్

అపర భగీరధుడు ఈ వాటర్ మేన్

రాంచీ: ఈ అపర భగీరధుడి పేరు సైమన్ ఒరాన్. స్థానికంగా ఆయన్ని అందరూ బాబా అని పిలుస్తారు. మీడియా ‘వాటర్ మేన్’ అని పిలుస్తుంది. జార్ఖండ్‌లోని బెరో తాలూకా, ఖక్సీ టోలి గ్రామానికి చెందిన ఆయన 1961లో వచ్చిన తీవ్ర కరవు కాటకాలను చూశారు. పొట్ట చేతపట్టుకొని గ్రామాలకు గ్రామాలు వలసపోవడాన్ని చూశారు. మనసు వికలమైంది. వలసల నుంచి ప్రజలను నిలువరించేందుకు ఏదో ఒకటి చేయాలనుకున్నారు. పరిస్థితుల్లో మార్పు తీసుకరావాలనుకున్నారు. కరవు పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలని ఆలోచించారు.

ప్రకృతి ధర్మాన్ని పాటించడం, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడం ఒక్కటే మార్గమని భావించారు. 1961లోనే తన ఉద్యమాన్ని ప్రారంభించారు. విరివిగా చెట్లను నాటాలనుకున్నారు.  చెట్లను నరికేస్తున్న అడవి దొంగలను ఎదుర్కోవాలనుకున్నారు. చెట్లను నాటడం, కష్టపడి వాటికి నీటిని పోయడం మొదలుపెట్టారు. తొలుత అడవి దొంగలను ఒంటరిగానే ఎదుర్కొన్నారు. తన ఒక్కడి శక్తి అందుకు సరిపోదని గ్రహించారు. మద్దతుకోసం గ్రామస్థులను కోరారు. వాళ్లను ప్రాధేయపడ్డారు. బాబా చిత్తశుద్ధిని, అకుంఠిత దీక్షను చూసిన గ్రామస్థులు ఆయన వెంట నడిచారు.

గ్రామస్థుల సహాయంతో బాబా తన స్వగ్రామంలో నీటి పరిరక్షణకు చర్యలు ప్రారంభించారు. గ్రామ శివారులో నీటి గుంతలను త వ్వారు. వాటిలోకి వర్షం నీరు చేరేందుకు కాల్వలు కట్టారు. గ్రామంలో నీటి నిల్వలు పెరిగాయి. వరి పంటలు, కూరగాయలు  పండడం మొదలైంది. అదే సమయంలో ఊరిలో గ్రామస్థుల సహకారంతో ఓ చిన్నపాటి డ్యామ్‌ను నిర్మించారు. ఆ సంవత్సరం వచ్చిన వర్షానికి ఆ డ్యామ్ కాస్త కొట్టుకుపోయింది. అయినా నిరుత్సాహపడలేదు. పంచాయతీ ద్వారా పైఅధికారులను కలసి డ్యామ్ నిర్మాణం కోసం పోరాడారు. డ్యామ్ మంజూరైంది. ఈ సారి ప్రభుత్వ డబ్బులతోనే పటిష్టంగా డ్యామ్‌ను నిర్మించారు. దాంతో గ్రామంలో కరవు ఛాయలు కనుమరుగయ్యాయి.

బాబా అంతటితో తన ఉద్యమాన్ని ఆపలేదు. పొరుగూళ్లపై దృష్టి సారించారు. అక్కడి ప్రజలతో మమేకమై తన గ్రామంలో సాధించిన విజయాన్ని ఆ గ్రామాల్లోనూ సాధించారు. బాబా పుణ్మమా ! అని బెరో తాలూకాలోని మొత్తం 51 గ్రామాల రూపురేఖలనే మార్చి వేశారు. మోడువారిన చెట్లతో, పాడు దిబ్బలుగా ఉన్న ఆ గ్రామాలు కాస్త ఇప్పుడు హరిత వనాలతో కళకళలాడుతున్నాయి. ఆ గ్రామాల్లో ఇప్పుడు ఎక్కడా నీటికి కొదువ లేదు. ప్రస్తుతం 84వ ఏట అడుగుపెట్టిన బాబా గత 55 ఏళ్లుగా అవిశ్రాంతంగా శ్రమిస్తూనే ఉన్నారు. నేటికి చిన్న పెంకుటిట్లో నివసించే బాబా ప్రతిరోజు ఉదయం నాలుగున్నర గంటలకు లేచి తాను నాటిని మొక్కల బాగోగులు చూసుకునేందకు వెళతారు. మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికొస్తారు. అనంతరం మళ్లీ ఊరు చివరనున్న అడవికి వెళతారు. ఆ అడవిని ఆయనే పెంచారట. తిరిగి రాత్రి వేళ ఇంటికి వస్తారు. ఇప్పటికీ ఆయన మొక్కలను నాటుతూనే ఉన్నారు. ఏడాదికి వెయ్యి మొక్కలను నాటి, వాటి సంరక్షణను చూసుకుంటున్నారని గ్రామస్థులు తెలిపారు.

బాబా కృషిని చూసిన ప్రభుత్వం ‘పద్మశ్రీ’ బిరుదుతో ఇటీవల సత్కరించింది. జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టిన వాటర్ షెడ్ కార్యక్రమానికి ప్రభుత్వం ఇప్పుడు బాబాను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఈ వయస్సులో కూడా ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా సేవలు అందిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement