చలామణిలో 86 శాతం నగదు
► లోక్‌సభలో కేంద్రం వెల్లడి
► రాజ్యసభలో సుష్మపై రెండు హక్కుల తీర్మానం నోటీసులు
న్యూఢిల్లీ: నోట్ల రద్దుకు ముందు చలామణిలో ఉన్న నగదులో 86 శాతం ఈ ఏడాది జూలై 21 నాటికి మార్కెట్లో అందుబాటులో ఉందని లోక్‌సభకు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. డిమాండ్‌కు సరిపడా కరెన్సీ నోట్లను సరఫరా చేసేందుకు ఆర్బీఐ అన్ని ఏర్పాట్లు చేసిందని ఆర్థిక శాఖ సహాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ తెలిపారు. మరోవైపు ఎల్పీజీ సిలిండర్లపై నెలవారీ రూ. 4 పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లోక్‌సభలో విపక్షాలు డిమాండ్ చేశాయి. కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదురీ మాట్లాడుతూ.. ఎల్పీజీ సబ్సిడీ ఎత్తివేస్తున్నారని, ఒక్కసారిగా 18 కోట్ల మంది ఎలా ధనవంతులుగా మారిపోతారు? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
కశ్మీర్‌లోకి పాకిస్తాన్ ఉగ్రవాదుల చొరబాట్లు పెరిగినా.. వాటిని దీటుగా తిప్పికొడుతున్నామని రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభకు తెలిపారు. కాగా, రైల్వే టికెట్ల బుకింగ్ కోసం ఆధార్ తప్పనిసరి కాదని రాజ్యసభకు కేంద్రం తెలిపింది.
సుష్మ సభను తప్పుదారి పట్టించారు: కాంగ్రెస్
విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సభను తప్పుదారి పట్టించారంటూ రాజ్యసభలో కాంగ్రెస్ రెండు సభా హక్కుల తీర్మానం నోటీసులు అందచేసింది. ఆగస్టు 3న విదేశాంగ విధానంపై చర్చ సందర్భంగా సుష్మ సభను తప్పుదారి పట్టించారని కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. బాండుంగ్‌లో ఆఫ్రో–ఆసియన్ సదస్సులో నెహ్రూ పేరును ప్రస్తావించకపోవడంపై కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది. సదస్సులో భారత్ తరఫున ఎవరూ మాట్లాడలేదని సుష్మ అబద్ధమా డారంది. మోదీ లాహోర్ పర్యటన అనంతరం దేశంలో ఎలాంటి ఉగ్రవాద దాడి జరగలేదంటూ సుష్మ సభను తప్పుదారి పట్టించారని మరో హక్కుల తీర్మానం నోటీసును కాంగ్రెస్ అందజేసింది.