
900 మంది యాత్రికులను రక్షించిన సైన్యం
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న దాదాపు 900 మంది యాత్రికులను ఎన్డీఆర్ఎఫ్(నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) బృందాలు రక్షించాయి. ఇంకా వరదల్లో చిక్కుకున్న వారి సంఖ్య వేలల్లో ఉండటంతో ప్రభుత్వం తన కార్యచరణను ముమ్మరం చేసింది. రేపు ఉదయానికి కల్లా అన్ని రోడ్డు మార్గాలను సరి చేసి బాధితులను రక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం హరీష్ రావత్ తెలిపారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ - కశ్మీర్ రాష్ట్రాల్లో ఒక్కసారిగా వర్షం కురవడంతో నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. గంగానది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది.
బద్రీనాథ్, హేమకుండ్ తదితర ప్రాంతాల్లో తొమ్మిదివేల మంది యాత్రికులు చిక్కుకున్నట్లు చమోలీ జిల్లా కలెక్టర్ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. శనివారం నాటికి మరింత మందిని హెలికాప్టర్ల ద్వారా సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తామన్నారు. ఉత్తరాఖండ్ లో సంభవించిన వర్ష బీభత్సానికి కేదార్ నాథ్ లోయలో ఆరు బ్రిడ్జిలు కొట్టుకుపోగా, రుద్రప్రయోగ్, చమోలీ జిల్లాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. బద్రీనాథ్ దారిలో చిక్కుకుపోయిన యాత్రికులను జోషిమఠ్ కు తరలించారు.
బద్రీనాథ్ యాత్రకు వెళ్లి వరదల్లో చిక్కుకున్న వారిలో కొంతమంది తెలుగు యాత్రికులు ఉన్నారు. అనంతపురం, కర్ణాటక కు చెందిన 130 యాత్రికులు వరదల్లో చిక్కుకుని నానా ఇబ్బందులు పడుతున్నారు. వరదల్లో చిక్కుకున్న వారిలో అనంతపురం, బెళగుప్ప, కదిరి, హిందూపురం, తనకల్లు, మడకశిర ప్రాంతాలకు చెందిన యాత్రికులు ఉన్నారు. 100 మీటర్ల రహదారి తెగిపోవడంతో నాలుగు రోజులుగా యాత్రికులు అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి.