98 శాతం మందికి ఆ టెక్నిక్ తెలియదు
98 శాతం మందికి ఆ టెక్నిక్ తెలియదు
Published Mon, Oct 3 2016 12:26 PM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM
న్యూఢిల్లీ: గుండెజబ్బులతో మృతిచెందేవారి సంఖ్య పెరిగిపోతున్న భారత్లో.. దానిపై అవగాహన మాత్రం దాదాపు శూన్యంగా ఉందని ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. హఠాత్తుగా గుండెపోటు సంభవించినప్పుడు ప్రాణాలను కాపాడటంలో సహకరించే చిన్న చిన్న టెక్నిక్లు సైతం భారత్లో 98 శాతం మందికి తెలియవని లిబ్రేట్ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. దేశవ్యాప్తంగా 20 నగరాల్లోని 25 నుంచి 50 ఏళ్ల మధ్య వయసులో ఉన్న సుమారు లక్ష మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరిలో యువతకు సైతం హార్ట్ ఎటాక్ సమయంలో ఎలా స్పందించాలనే అంశంలో స్పష్టతలేకపోవడం ఆందోళనకరమని లిబ్రేట్ సీఈవో సౌరబ్ అరోరా తెలిపారు.
హార్ట్ ఎటాక్ సమయంలో ఎంతగానో ఉపకరించే కార్డియోపల్మొనరి రిసక్సిటేషన్(సీపీఆర్) టెక్నిక్ గురించి దేశవ్యాప్తంగా అవగాహన కల్పించాల్సిన అవసరముందని సర్వే నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. హార్ట్ ఎటాక్ సంబంధిత కేసుల్లో ఆసుపత్రికి చేరేలోపే 60 శాతం మంది మృతి చెందుతున్నారని గణాంకాలు వెల్లడిస్తున్న నేపథ్యంలో కీలక సమయంలో ఎలా స్పందించాలో తెలుసుకోవడం మంచిదన్నారు.
Advertisement
Advertisement