సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్‌ను జీడీపీ వృద్ధి గణాంకాలు నిరాశపర్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్ త్రైమాసంలో వృద్ధి రేటు 7.1 శాతానికి పడిపోయింది. గత మూడు త్రైమాసాలతో పోలిస్తే వృద్ధి రేటు కనిష్టంగా నమోదైంది. అయితే గత ఏడాది ఇదే క్వార్టర్‌లో వృద్ధి రేటు 6.3 శాతంగా నమోదైంది.
తయారీ, వ్యవసాయ రంగాలు మెరుగైన సామర్ధ్యం కనబరచడంతో ఈ ఏడాది ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో వృద్ధి రేటు 8.2 శాతంగా నమోదైంది. జనవరి-మార్చి క్వార్టర్‌లో 7.7 శాతం వృద్ధి రేటు నమోదైంది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వెల్లడైన వృద్ధి రేటు గణాంకాలు నిరుత్సాహకరంగా ఉండటం మోదీ సర్కార్‌కు ఇబ్బందికరమేనని భావిస్తున్నారు. ఇక జులై-సెప్టెంబర్ త్రైమాసంలో చైనా ఆర్థిక వ్యవస్థ 6.5 శాతం వృద్ధి సాధించింది. చైనాతో పోలిస్తే వృద్ధి రేటు మెరుగ్గా ఉండటంతో భారత్ వేగంగా ఎదుగుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తన స్ధానాన్ని పదిలపరుచుకోవడం ప్రభుత్వానికి కొంతమేర ఊరటగా చెప్పుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment