హవ్వా పోలీసూ.. నీకు ఇది తగునా..!
ముజఫర్నగర్: అది పోలీసు ఉద్యోగమే కావొచ్చు. మరింకేదైనా అయ్యుండొచ్చు. మనిషి లేకుంటే ఆ ఉద్యోగానికి విలువే లేదు. ఎందుకంటే మనుషులే లేకుంటే అసలు ఉద్యోగాలే అవసరం ఉండదు.. ఆ ఉద్యోగం ఇచ్చే వారే ఉండరు. అలాంటి మనిషి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ న్యాయంతో కూడిన సేవ చేయాల్సింది పోయి ఓ బానిసలాగా మార్చి సేవ చేయించుకునే ప్రయత్నం చేయకూడదు. ముఖ్యంగా పోలీసులు ఈ పని అస్సలు చేయకూడదు. ఎందుకంటే వారికి ఉండాల్సిన గుణం తప్పు చేస్తే శిక్షించడం, సరైన దారిలో పెట్టడం.
అంతేగానీ, ఆ ఉద్యోగాన్ని ఆసరాగా పెట్టుకొని అడ్డమైన సేవలు చేయించుకుంటే నలుగురితో నానా మాటలు పడాల్సి వస్తుంది. పొగరు తలకెక్కింది అని తిట్టించుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ పోలీసులు అదే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ వ్యక్తిని స్టేషన్లో కూర్చొబెట్టుకొని అతడితో పోలీసులు తమ షూస్ తుడిపించుకునే వీడియో ఒకటి బయటకు రావడంతో అదిప్పుడు సంచలనంగా మారింది. ఎంత పోలీసులు అయితే మాత్రం ఇలాంటి పనులు చేస్తారా అని పౌర సమాజం నివ్వెరపోతోంది. ఈ సంఘటనపై ముజఫర్ నగర్ ఎస్పీ సంతోష్ కుమార్ స్పందిస్తూ తన దృష్టికి ఇప్పుడే ఆ విషయం వచ్చిందని, దర్యాప్తు కొనసాగుతుందని తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.