భారత స్త్రీలకు రోల్ మోడల్ గా మారింది కేరళకు చెందిన ఓ మహిళ. తన పెళ్ళిని రద్దు చేసుకుంటూ ఫేస్ బుక్ లో ఆమె చేసిన పోస్ట్ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. కేరళ త్రిస్సూర్ కు చెందిన రెమ్యా రామచంద్రన్ స్వయం నిర్ణయాధికారంతో స్త్రీ శక్తిని చాటింది. వర కట్నాన్నీ, పురుషాధిక్యాన్నీ వ్యతిరేకిస్తూ తన నిర్ణయాన్ని చాటడంలో ధైర్య సాహసాలను ప్రదర్శించింది. నిశ్చితార్థం తర్వాత తనకు నచ్చని పెళ్ళిని రద్దు చేసుకుంది. అందుకు వివరణ ఇస్తూ తన నిర్ణయాన్ని ధైర్యంగా ఫేస్ బుక్ లో పోస్టు చేసింది.
''ఫ్రెండ్స్... నా పెళ్ళి గురించి అడుగుతున్న కొందరు మిత్రులకు ఇక్కడ నేను ఓ ప్రకటన ఇస్తున్నాను. నిశ్చితార్థానికి ముందు నన్ను పెళ్ళి చేసుకుంటానన్న వ్యక్తి... కేవలం నువ్వుంటే చాలని చెప్తుండేవాడు. ఇప్పుడు ఐదు లక్షల కట్నంతోపాటు... 50 తులాల బంగారం కూడ డిమాండ్ చేస్తున్నాడు. నేను వరకట్నానికి పూర్తిగా వ్యతిరేకం. అందుకే ఈ వివాహాన్ని రద్దు చేసుకుంటున్నాను. ధన్యవాదాలు" అన్న.. రెమ్యా ఫేస్ బుక్ పోస్టుకు ఎంతో మద్దతు లభించింది. అంతేకాదు.. ఎందరో రెమ్యాను అభినందిస్తూ, సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నావంటూ కామెంట్లు పంపారు. ''మీవంటి స్త్రీలు మహిళా లోకానికే స్ఫూర్తిదాయక''మని, ''యువతకు మీరో రోల్ మోడల్'' అని ఇబ్బడి ముబ్బడిగా కామెంట్లను పంపుతూ సపోర్ట్ చేశారు.
తమ మనసుకు నచ్చిన, మెచ్చిన రీతిలో మహిళలు జీవించే రోజులు వచ్చినట్లు రెమ్యా నిర్ణయం చెప్తోంది. స్థైర్యం, ధైర్యంతో స్వేచ్ఛను సొంతం చేసుకునే ఘడియలు ఆసన్నమయ్యాయని నిరూపిస్తోంది. స్వాతంత్ర్యం వచ్చి ఏళ్ళు గడిచినా... ముఖ్యంగా ఆర్థిక స్వాతంత్రం ఉన్నా... జీవితాన్ని తమకిష్టమైన రీతిలో మలచుకోగలిగే స్థానంలో నేటికీ స్త్రీలు కనిపించడం లేదు. కులం, ఆచారాలు, సంప్రదాయాలు వెనక్కులాగుతుండటంతో... చదువులో, కెరీర్‌లో అత్యున్నత ప్రతిభను కనబరిచిన వారు కూడా పెళ్ళి విషయంలో మాత్రం తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరచ లేకపోతున్నారు. అయితే ప్రస్తుతం ఇటువంటి స్త్రీలకు రెమ్యా రోల్ మోడల్ గా మారింది.
ఫేస్ బుక్ లో పెళ్ళి రద్దు..!
Published Wed, Dec 9 2015 4:38 PM | Last Updated on Sun, Sep 3 2017 1:44 PM
Advertisement