సామాన్యుడికి చాలా ఇబ్బంది: కాంగ్రెస్
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల చలామణి వాడకంపై మోదీ ప్రభుత్వం తీసుకున్న అకస్మాత్తు నిర్ణయంపై కాంగ్రెస్ పలు ప్రశ్నలు సంధించింది. దీనివల్ల సామాన్య ప్రజలు, రైతులు చాలా ఇబ్బందులు పడతారని ఆందోళన వ్యక్తంచేసింది. అలాగే వ్యాపారులు, చిన్న వర్తకులు, గృహిణులు కూడా ఆందోళన చెందుతారని పేర్కొంది. మంగళవారం పార్టీ ముఖ్యఅధికార ప్రతినిధి రణ్‌దీప్ మీడియాతో మాట్లాడుతూ.. నల్లధనం నియంత్రణకు తీసుకునే అర్థవంతమైన చర్యలకు తమ పార్టీ ఎప్పటికీ మద్దతు పలుకుతుందన్నారు.
విదేశాల్లో దాగున్న రూ.80 లక్షల కోట్లను వెనక్కితెచ్చి, ప్రజల ఖాతాల్లో రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తామన్న హామీని నెరవేర్చడంలో విఫలమై ఈ నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. వాస్తవ పరిస్థితి ఎలా ఉంటుందో అధ్యయనం చేయకుండా ప్రస్తుత పండుగ, పెళ్లిళ్ల సీజన్‌లో హఠాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సామాన్యులకు చాలా సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. ఒకవైపు నల్లధనంపై పోరాటం చేస్తున్నామంటూనే .. మరోవైపు రూ. 2 వేల నోటును ప్రవేశపెడతామని చెప్పడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు.
మోదీ ఆధునిక తుగ్లక్
కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారీ ట్విటర్‌లో స్పందిస్తూ.. ‘మోదీ రూ.500, 1000 నోట్లను రద్దుచేసి సామాన్యుడిపై అణ్వస్త్రాన్ని ప్రయోగించారు. దీన్నిబట్టి చూస్తూ ఆయన ఆధునిక తుగ్లక్ అని అర్థమవుతుంది. తుగ్లక్‌ను తలపిస్తున్న ఆయన దేశ తదుపరి రాజధానిని ఢిల్లీ నుంచి దౌలతాబాద్‌కు మారుస్తారేమో. దేశంలో చాలామంది ప్రజలు నగదుతోనే లావాదేవీలు చేస్తారు. వారికి బ్యాంక్ సౌలభ్యం లేదు. ఇప్పుడు వెరుు్యరూపాయలంటే 20 ఏళ్ల క్రితం రూ. వందతో సమానం’ అని పేర్కొన్నారు.