‘మోదీ, బీజేపీ నేతలు తప్పు ఒప్పుకున్నారు’
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అందుకు తాజా మంత్రివర్గ విస్తరణే నిదర్శనమని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత మనీష్ తివారీ విమర్శించారు. ప్రభుత్వం చాలా అంశాల్లో దారుణ వైఫల్యాలను మూటకట్టుకోవడంతో కేబినెట్ హోదా నుంచి కొందరు మంత్రులను తప్పించారని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో పెద్ద నోట్లరద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాని మోదీ పాలన తుగ్లక్ పాలనను తలపిస్తుందని విమర్శించిన మనీష్ తివారీ తాజాగా కేబినెట్ విస్తరణపై తీవ్ర స్థాయిలో స్పందించారు.
న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్ మెంట్ మాజీ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ, కార్మికశాఖ మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) మాజీ మంత్రి కల్‌రాజ్ మిశ్రాలను మంత్రి వర్గం నుంచి తొలగించడమంటే.. స్కిల్ డెవలప్ మెంట్, ఉద్యోగకల్పన చేయలేకపోవడంతో పాటు పరిశ్రమలు తీసుకురాలేదని ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు తామంతట తామే తప్పును ఒప్పుకున్నట్లేనని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారీ చెప్పారు. ఇంకా చెప్పాలంటే వీఐపీలకు మాత్రమే పనిచేసే వ్యక్తులకు కేబినెట్ హోదా దక్కిందని ఎద్దేవా చేశారు. కొత్త మంత్రివర్గం ఓల్డ్ సిటిజన్ క్లబ్ లా మారిందన్నారు.
పెట్రోలియం మంత్రిగా 38 నెలలు పనిచేసిన వ్యక్తి ధర్మేంద్ర ప్రదాన్ కేవలం వీఐపీల కోసం పనిచేసి కేబినెట్ లో ప్రమోషన్ పొందారని ఆరోపించారు. బీజేపీ కోశాధికారి అయినందున విద్యుత్ శాఖ మంత్రిగా చేసిన పీయూష్ గోయల్ రైల్వేశాఖ మంత్రిగా కేబినెట్ హోదా దక్కించుకున్నారని చెప్పారు. ఈ ఇద్దరితో పాటు నిర్మలా సీతారామన్ (రక్షణశాఖ), ముక్తార్ అబ్బాస్ నఖ్వీ (మైనారిటీ వ్యవహారాలశాఖ)లు కేబినెట్ హోదా దక్కించుకోగా, తెలుగు రాష్ట్రాలకు మాత్రం కేంద్రం మొండిచేయి చూపించింది.