సీఎంగా పళనిస్వామి..మార్గదర్శక కమిటీ అధ్యక్షుడిగా పన్నీర్!
తెరపైకి కొత్త ప్రతిపాదన
సాక్షి, చెన్నై: ప్రభుత్వంతో పాటు అన్నాడీఎంకేను నడిపిం చేందుకు గానూ ఓ మార్గదర్శక కమిటీని నియమించాలనే ప్రతిపాదనను తమిళనాడు సీఎం పళనిస్వామి వర్గం తెర మీదకు తెచ్చినట్టు ఆ పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. ఈ కమిటీకి అధ్యక్షుడిగా పన్నీర్ సెల్వాన్ని నియమించాలని, పళనిస్వామినే సీఎంగా కొనసాగించాలని రహస్య మంత నాల్లో ఓ నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. బుధవారం బాగా పొద్దుపోయాక పన్నీర్ వర్గానికి చెందిన మాజీ మంత్రులు కేపీ మునుస్వామి, నత్తం విశ్వనాథన్, పళని వర్గానికి చెందిన ఎంపీ వైద్యలింగం, మంత్రి సెంగోట్ట యన్ మధ్య మంతనాలు జరిగాయి. ఈ సందర్భంగా పళని వర్గం మార్గదర్శక కమిటీ నియామక ప్రతిపాదనను తెర మీదకు తెచ్చినట్టు తెలిసింది. పళనిస్వామిని సీఎంగా కొన సాగించాలని.. అలాగే ప్రభుత్వాన్ని, పార్టీని నడిపించేందుకు ఓ కమిటీని రంగంలోకి దించాలన్న సూచన చేసినట్లు సమాచారం. పన్నీరు అధ్యక్షుడిగా, రెండు వర్గాలకు చెందిన ఐదు గురు లేదా ఏడుగురిని సభ్యులుగా ఎంపిక చేయాలని నిర్ణ యించినట్టు తెలిసింది.
సమస్యలన్నీ ఓ కొలిక్కి వచ్చాక, పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించి.. మెజారిటీ శాతం అభి ప్రాయం మేరకు తదుపరి అడుగులు వేద్దామన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కాగా, గురువారం మంత్రి సెంగో ట్టయన్ మీడియాతో మాట్లాడుతూ.. విలీన చర్చల విషయం లో పార్టీ వర్గాలెవ్వరూ నోరు మెదిపేందుకు వీల్లేదని, అన వసర గందరగోళం సృష్టించవద్దని హెచ్చరించడం గమ నార్హం. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మూడో రోజు 17 జిల్లాల కార్యదర్శులతో సీఎం భేటీ అయ్యారు. ఈ భేటీలో పలువురు శశికళ, దినకరన్‌లకు మద్దతుగా స్పందించడంతో ఆయన షాక్‌కు గురైనట్లు తెలిసింది. ఓవైపు రహస్య మంతనాలు, అభిప్రాయ సేకరణలు జరుగుతుంటే.. మరోవైపు అన్నాడీ ఎంకేలోని 28 మంది ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు నగరంలోని ఓ హోటల్‌లో రహస్యంగా సమావేశమయ్యారు. మంత్రి పదవు లపై వీరు ప్రధానంగా చర్చించుకున్నట్లు తెలిసింది.