సన్యాసినిపై గ్యాంగ్‌రేప్
- బెంగాల్‌లో దారుణం
- స్కూల్లోకి చొరబడ్డ దొంగలు
- 71 ఏళ్ల నన్ నోట్లో బట్టలు కుక్కి అత్యాచారం.. రూ.12 లక్షలతో పరారీ
కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో నదియా జిల్లా గంగ్నాపూర్‌లో 71 ఏళ్ల ఓ క్రైస్తవ సన్యాసినిపై దోపిడీ దొంగల ముఠా అత్యాచారానికి పాల్పడింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక 12.30 గంటలకు కాన్వెంట్ స్కూల్‌లోకి చొరబడ్డ దొంగలు ఆమె నోట్లో గుడ్డలు కుక్కి పైశాచికత్వం ప్రదర్శించారు. అనంతరం రూ.12 లక్షలను ఎత్తుకెళ్లారు. శనివారం పొద్దున ఈ విషయం తెలిసి స్కూలు పిల్లల తల్లిదండ్రులు, స్థానికులు ఆగ్రహోదగ్రులయ్యారు.ఎన్‌హెచ్-34, సీల్దా-రాణాఘాట్ రైలు మార్గంలోని పట్టాలపై ధర్నా చేశారు.
రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. సీఎం మమతా బెనర్జీ ఈ ఘటనపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశించారు. ముగ్గురు నుంచి నలుగురు దొంగలు ఈ దారుణంలో పాలుపంచుకొని ఉంటారని అధికారులు చెబుతున్నారు. ఉదయం స్కూలుకు వచ్చిన హాస్టల్ సిబ్బంది.. విషయం తెలుసుకుని సన్యాసినిని రాణాఘాట్ ఆస్పత్రికి తరలించారు.
దోషులను కఠినంగా శిక్షిస్తామని మమత చెప్పారు. దొంగలు కాన్వెంట్‌లోని ప్రార్థన ఆలయాన్ని కూడా ధ్వసం చేశారని, అక్కడి పవిత్ర వస్తువులన్నింటినీ చిందరవందర చేశారని కోల్‌కతా ఆర్చిబిషప్ తెలిపారు. కాగా, పోలీసులు సీసీఫుటేజీ ఆధారంగా నలుగురు నిందితులను గుర్తించారు.