భర్తలను బాదేందుకు బ్యాట్లు
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆధ్యర్యంతో జరిగిన సామూహిక వివాహ మహోత్సవంలో 700 మంది పెళ్లి కూతుళ్లకు రాష్ట్ర సామాజిక న్యాయం, గ్రామీణాభివద్ధి శాఖ మంత్రి గోపాల్ భార్గవ ఓ వినూత్న బహుమతిని అందజేశారు. తాగివచ్చే భర్తలను, ముఖ్యంగా తాగొచ్చి హింసించే భర్తలను బాదేందుకు బట్టలుతికే బ్యాట్లను ఆయన బహూకరించారు. తాను మొత్తం పదివేల బ్యాట్లను తయారు చేయించానని చెప్పారు. ‘భర్తలు గృహహింసకు పాల్పడితే ఈ బ్యాట్లతో కొట్టండి. పోలీసులు ఇందులు జోక్యం చేసుకోవద్దు’ అన్న వ్యాఖ్యలు కూడా వాటిపై రాసి ఉన్నాయి.
మధ్యప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో భర్తలు తాగొచ్చి భార్యలను హింసించడం సర్వసాధారణమై పోయిందని, అలాంటి వారికి బుద్ధి చెప్పాలంటే ఇలాంటి బ్యాట్ల అవసరం ఎంతైనా ఉందని మంత్రి గోపాల్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో గులాబీ గ్యాంగ్ ఆందోళన చూశాక తనకు ఈ ఆలోచన వచ్చిందని ఆయన చెప్పారు. ఇటీవల వైన్ షాపులను మూసేయాలని డిమాండ్ చేస్తూ కొంత మంది మహిళలు గులాబీ రంగు చీరలు కట్టుకొని, బ్యాట్లు పట్టుకొని వీధుల్లోకి వచ్చారు. ఇక ముందు కూడా పెళ్లి కూతుళ్లకు ఈ బ్యాట్లను బహూకరించడం కొనసాగిస్తానని మంత్రి తెలిపారు.