కొడుకు ఆచూకీ తెలిపిన ఆధార్!
కాలడి: కొడుకు కోసం 16 ఏళ్లుగా కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన ఓ వృద్ధురాలు ఆధార్ కార్డు సాయంతో అతని ఆచూకీ కనుగొంది! కేరళ లోని శ్రీమూలనగరం గ్రామానికి చెందిన కల్యాణి(80)కి భర్త, ఇద్దరు కొడుకులు చనిపోయారు. మూడో కొడుకు వీవీ మోహన్ 16 ఏళ్ల కిందట పనికోసం గోవా వెళ్లాడు. దీంతో అమె అప్పట్నుంచి శిథిలావస్థలోఉన్న ఇంట్లో గడుపుతూ, ఇరుగుపొరుగు వారు పెట్టే తిండితో రోజులు వెళ్లదీస్తోంది. వయసు పైబడినా, కంటిచూపు తగ్గినా ఆశ మాత్రం వదులుకోలేదు. ఇటీవల ఆమె ఇంటికి పోస్టులో ఓ కవరు వచ్చింది. దాన్ని ఆమె గ్రామ పంచాయతీ అధ్యక్షుడు కేసీ మార్టిన్ వద్దకు తీసుకెళ్లింది. కవర్ తెరిచి చూడగా అందులో మోహన్ ఆధార్ కార్డు కనిపించింది. కల్యాణి బంధువులు, పొరుగువారు శతవిధాలా ప్రయత్నించి అతని ఆచూకీ కనుగొన్నారు. మోహన్ ఓ హత్యకేసులో 13 ఏళ్ల నుంచి గోవాలోని అగౌదా జైల్లో ఉంటున్నట్లు తెలుసుకున్నారు. గత శనివారం జైలుకు వెళ్లి అతన్ని కలుసుకుని తల్లి పరిస్థితి గురించి చెప్పారు. అతడు తల్లిని చూసేందుకు వీలుగా పెరోల్ కోసం సన్నాహాలు చేస్తున్నామన్నారు.