ప్రేమ జంటపై దాడికి యత్నం
తొగుట : ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంటపై దాడికి యత్నించడంతో భయాందోళనకు గురైన ఆ జంట ఆదివారం స్థానిక పోలీసులను ఆశ్రయించింది. వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని గుడికందుల గ్రామానికి చెందిన మట్టె వెంకట్‌రెడ్డి, బుచ్చవ్వల కుమారుడు శ్రీకాంత్‌రెడ్డి(22) అదే గ్రామానికి చెందిన తూంకుంట్ల అలియాస్ చీకోడ్ శ్రీనివాస్‌రెడ్డి, యాదమ్మల కుమార్తె కల్యాణి (19)లు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వీరి పెళ్లికి ఇరువురు కుటుంబీకులు అడ్డు చెప్పడంతో అక్టోబర్ 19న నిజామాబాద్ జిల్లా బాసరలో గల సరస్వతి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు.
అనంతరం నేరుగా మిరుదొడ్డి (గుడికందుల గ్రామం మిరుదొడ్డి పోలీస్‌స్టేషన్ పరిధి)లోకి రావడంతో ప్రేమ జంట పోలీస్టేషన్‌కు వెళ్లారు. దీంతో సీఐ రామకృష్ణారెడ్డి ఇరువర్గాల పెద్దలను పోలీస్టేషన్‌కు పిలిపించి ఇరువురూ మేజర్లు కావడంతో వారికి ఏమైనా ఇబ్బందులు కల్గిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కౌన్సెలింగ్ నిర్వహించి పంపారు. అనంతరం కొత్త జంట గుడికందులలో కాపురం పెట్టారు. ఈ నేపథ్యంలో కల్యాణి తండ్రి శ్రీనివాస్‌రెడ్డి శనివారం అర్ధరాత్రి తన బంధువులు, అనుచరులతో కుమార్తె కల్యాణి, ఆమె భర్త శ్రీకాంత్‌రెడ్డిను హత్య చేసేందుకు రెండు వాహనాల్లో గుడికందులకు వచ్చాడు. అనంతరం శ్రీకాంత్‌రెడ్డిఇంటి తలుపు తట్టాడు.
దీంతో శ్రీకాంత్‌రెడ్డి, కల్యాణిలు భయంతో పెద్దగా అరవడంతో ఇరుగు పొరుగు వారు మేలుకొనడంతో శ్రీనివాసరెడ్డి, అనుచరులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ క్రమంలో శ్రీనివాసరెడ్డి వెంట తెచ్చుకున్న వేట కొడవళ్లు, కత్తులు, గడ్డపారలు, కారంపొడి, కట్టెలు అక్కడే పడేసి వెళ్లారు. దీంతో భయాందోళనకు గురైన శ్రీకాంత్‌రెడ్డి, కల్యాణిలు ఆదివారం మిరుదొడ్డి పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయాన్ని చెప్పారు. తనను , తన భర్తను చంపడానికి తన తండ్రి శ్రీనివాసరెడ్డి, ఎల్లయ్య శ్రీపాల్‌రెడ్డి, శేఖర్, బైరారెడ్డి, బోయిని యాదయ్యలు యత్నించడంతో తాను గుర్తించినట్లు కల్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన తండ్రితో తమకు ప్రాణహాని ఉందని శ్రీకాంత్‌రెడ్డి దంపతులు తెలిపారు.