
తిరువూరు : నది ఒడ్డున కుప్పలు తెప్పలుగా ఆధార్ కార్డులు దర్శనమిచ్చిన ఘటన తమిళనాట కలకలం రేపింది. తమిళనాడులో తిరుప్పూరు జిల్లా తిరుత్తురైపూండి ముళ్లియారు నది ఒడ్డున వేలాది ఆధార్ కార్డులు పడి వున్నాయి. గురువారం ఉదయం మూడు గోనె సంచులను స్థానికులు కనుగొన్నారు. వాటిని విప్పి చూడటంతో దాదాపు 3 వేల ఆధార్ కార్డులు కనిపించాయి. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
స్థానికుల సమాచారం ఆధారంగా నదీ తీరానికి చేరుకున్న స్థానిక అధికారి రాజన్‌బాబు నేతృత్వంలోని రెవెన్యూ అధికారులు ఈ ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. కట్టిమేడు, అత్తిరంగం, వడపట్టి, పామణి గ్రామాల ప్రజలకు చెందినవిగా అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ప్రాథమిక సమాచారం ఆధారంగా పంపిణీకోసం పోస్టల్ శాఖకు పంపగా, తపాలా శాఖ ఉద్యోగులు వాటిని నదిలోకి విసిరివేసి వుంటారని అనుమానిస్తున్నారు.
కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గత ఏడాది మార్చిలో ముంబైలోని ఒక పాడు బడ్డ బావిలో వేలాది ఆధార్ కార్డులు పడి ఉండడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment