ఎమ్మెల్యే నిధులు 250 శాతం పెంచుతాం!
వరుసపెట్టి కష్టాలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు ఇప్పుడు సరికొత్త రాగం మొదలుపెట్టింది. ఎమ్మెల్యేల స్థానిక ప్రాంత అభివృద్ధి (లాడ్) నిధులను ఒకేసారి 250 శాతం పెంచాలని ప్రతిపాదిస్తోంది. ఈ నిధలు ప్రస్తుతం రూ. 4 కోట్లు ఉండగా, వాటిని రూ. 14 కోట్లకు పెంచాలని ప్రతిపాదించింది. ఎమ్మెల్యేలు తమతమ నియోజకవర్గాలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయని అధికారులు అంటున్నారు.
కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం ఈ ప్రతిపాదన పంపామని, నిబంధనల ప్రకారం ఢిల్లీ జలబోర్డు పనులకు కోటి రూపాయలు కేటాయించి, మిగిలిన వాటిని ఇతర పనులకు ఇస్తామని ఒక అధికారి చెప్పారు. దాంతో ఎమ్మెల్యేలకు అభివృద్ధి పనులకు పెద్దగా నిధులు ఉండట్లేదని, దాంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 10 కోట్లు అదనంగా కేటాయించాలని ప్రభుత్వం తలపెడుతోందని ఆయన అన్నారు. అయితే.. వచ్చే సంవత్సరం ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ నిధులు కేటాయించినట్లు చెబుతున్నారు. ఇంతకుముందు ఎమ్మెల్యే నిధులు రూ. 2 కోట్లు ఉండగా.. షీలాదీక్షిత్ ప్రభుత్వం 2011లో వాటిని రూ. 4 కోట్లకు పెంచింది.