'భోజనం చెయ్యి ఇరవై వేలు ఇయ్యి'
"చెయ్యి.... భోజనం చెయ్యి.... చెయ్యాలంటే బాగా చెయ్యి.... "
"భోజనం చెయ్యాలంటే మాత్రం ఇయ్యి... ఇరవై వెయ్యి...."
ఇలా బాలకృష్ణ మార్కు డైలాగులు చెబుతున్నారు నిన్నమొన్నటి దాకా ఇన్ఫోసిస్ లో పనిచేసి ఇప్పుడు బయటకి వచ్చి, ఆమ్ ఆద్మీగా మారిన వి బాలకృష్ణన్.
బాలకృష్ణన్ ఆధ్వర్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజరీవాల్ మార్చి 15 న బెంగుళూరులో భోంచేయబోతున్నారు. ఆయనతో పాటూ పంక్తి భోజనం చేయాలనుంటే సింపుల్ గా ఓ ఇరవై వేలు రుసుము చెల్లించాల్సిందే. ఇలా ఒక విందుతో ఆమ్ ఆద్మీ పార్టీ ఏకంగా నాలుగు లక్షల రూపాయలు సంపాదించడం పార్టీ లక్ష్యమట.
ఈ సమావేశంలో ఐటీ ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు, పెద్దలు పాల్గొంటారట. ఏది కావాలంటే అది అడగొచ్చట. కూరా సాంబారు కాదండోయ్. ఆమ్ ఆద్మీ పార్టీ విధానాలు, సిద్ధాంతాలపై ఎలాంటి సందేహాలున్నా అడగొచ్చు. అన్ని డౌట్లూ క్లియర్ చేసేందుకు అరవింద్ కేజరీవాల్ రెడీగా ఉంటారట.
"రాజకీయ రంగంలో నిధుల సేకరణ అంతా చీకటి భాగోతం లాంటిదే. ఎక్కడినుంచి వస్తున్నాయి. ఎవరి నుంచి వస్తున్నాయి వంటి వంటాకి లెక్కా పత్రం ఉండదు. కాబట్టి పారదర్శకత కోసం ఇలా నిధుల్ని సేకరిస్తున్నాం" అని బాలకృష్ణన్ చెబుతున్నారు. ఇలాంటి ఫండ్ రెయిజింగ్ డిన్నర్స్ అమెరికన్ రాజకీయాల్లో మామూలే. కానీ ఆమ్ ఆద్మీలకు అందని ద్రాక్షల్లాంటి ఇలాంటి విందుల వల్ల ఏం లాభమని ఆప్ వ్యతిరేకులు విమర్శిస్తున్నారట.
అన్నట్లు పాకిస్తాన్ లో, బంగ్లాదేశ్ లోనూ ఆప్ లాంటి పార్టీలు పుట్టుకొస్తున్నాయట. పాకిస్తాన్ ఆమ్ ఆద్మీ పార్టీని పాప్ (PAAP) అని, బంగ్లాదేశ్ ఆమ్ ఆద్మీపార్టీని బాప్ (BAAP) అని అంటారట. మొత్తం మీద ఆప్ కొత్త రాజకీయాలు ఇండియాలోనే కాదు, ఖండాంతరాల్లోనూ సంచలనం సృష్టిస్తున్నాయి.