సెల్ఫీకి రూ.500
సాక్షి, బెంగళూరు: ఆప్‌ను ఓ పోరాట పార్టీగా ప్రధాని నరేంద్రమోదీ అభివర్ణించారని, పోరాటాలు చేయడం తప్పా? అని ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఢిల్లీ ఎన్నికల కోసం చేపట్టిన విరాళాల సేకరణలో భాగంగా ఆదివారం ఆయన బెంగళూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో శనివారం నిర్వహించిన నరేంద్రమోదీ ఎన్నికల ర్యాలీకి ప్రజల నుంచి మద్దతు లభించలేదని తెలిపారు. ర్యాలీకి జనాలను తరలించేందుకు వందలాది బస్సులను అద్దెకు తీసుకున్నారన్నారు. ఢిల్లీలో అధికారంలో ఉన్న సమయంలో తమ పార్టీ చేపట్టిన కార్యక్రమాలే తమకు శ్రీరామరక్ష అన్నారు. ఎన్నికల ఖర్చు కోసం ప్రజల నుంచి విరాళాలు సేకరించడంలో తప్పులేదన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వ్యాపారవేత్తలు, కార్పొరేట్ల నుంచి విరాళాలు సేకరిస్తున్నాయంటూ విమర్శించారు. అందువల్ల అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యాపారవేత్తలకు అనుకూలంగా చట్టాలను రూపొందిస్తారని ఆరోపించారు. ప్రజలకు అనుకూలమైన చట్టాలను రూపొందించేందుకు వీలుగా తాము ప్రజల నుంచే విరాళాలను సేకరిస్తున్నామన్నారు. కర్ణాటకతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో తమ పార్టీ విరాళాలను సేకరిస్తోందన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందన్నారు.ఓ సెల్ఫీకి రూ.500....: ఇక కేజ్రీవాల్‌తో సెల్ఫీ తీసుకునేందుకు గాను ఆసక్తి చూపే వారి నుంచి ఆప్ కార్యకర్తలు రూ.500 విరాళాన్ని వసూలు చేశారు. కేజ్రీవాల్ బసచేసిన ఉడ్‌ల్యాండ్ హోటల్‌లో అనేక మంది నగర వాసులు కేజ్రీవాల్‌తో సెల్ఫీ తీయించుకునేందుకు ఆసక్తి చూపారు.