నలుగురు కానిస్టేబుళ్లను హతమార్చిన నక్సల్స్
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో ఘటన
చింతూరు: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకానికి నలుగురు పోలీసు కానిస్టేబుళ్లు బలయ్యారు. సోమవారం అపహరించుకుపోయిన ఈ నలుగురు కానిస్టేబుళ్లను మావోయిస్టులు కాల్చిచంపి.. రోడ్డుపై పడేశారు. ఇక్కడి బీజాపూర్ జిల్లా గుద్‌మా గ్రామ శివార్లలోని రహదారిపై బుధవారం వారి మృతదేహాలు లభించాయి. బీజాపూర్ జిల్లా బెద్‌రే పోలీసు స్టేషన్‌లో జయరాం యాదవ్, మంగ్లు సోడి, రామా మజ్జి, రాజు తెల్లంలు సహాయ కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్నారు. సోమవారం (13న) వారు అటవీ ప్రాంతంలో ప్రయాణిస్తుండగా.. మావోయిస్టులు అపహరించుకు వెళ్లారు.
అనంతరం వారిని కాల్చి చంపేశారు. వారి ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసు బలగాలకు గుద్‌మా గ్రామ శివార్లలో రోడ్డుపై నలుగురు కానిస్టేబుళ్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. సల్వాజుడుంలో చురుకుగా వ్యవహరిస్తూ ఆదివాసీలను వేధిస్తున్నందునే ప్రజాకోర్టులో వారిని హతమార్చినట్లు మావోయిస్టు ఇంద్రావతి నేషనల్ పార్క్ ఏరియా కమిటీ పేరుతో ఘటనా స్థలంలో లేఖ వదిలారు. కానిస్టేబుళ్లను మావోయిస్టులు హతమార్చడంపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ తవ్రంగా మండిపడ్డారు. నక్సల్స్‌ది అమానుష, పిరికి పందల చర్య అని విమర్శించారు. పోలీసు బలగాలను నైతికంగా దెబ్బకొట్టేందుకే వారు ఈ పనికి ఒడిగట్టారన్నారు.