న్యూఢిల్లీ : బాలాకోట్ ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడి చేసిన తరువాత, ప్రతీకార ధోరణిలో పాకిస్థాన్ గత ఫిబ్రవరి 27న భారత్‌పై వాయుదాడులకు ప్రయత్నించినప్పుడు ఆ దేశానికి చెందిన ఎఫ్-16 యుద్ధవిమానాన్ని కుప్పకూల్చడంలో అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ టీమ్ మొత్తానికి 51వ స్క్వాడ్రన్‌కు యూనిట్ సైటేషన్ అవార్డు దక్కింది. భారత వాయుసేన ప్రారంభమై 87 సంవత్సరాలు గడిచిన సందర్భంగా అక్టోబర్ 8న జరిగే ఎయిర్‌ఫోర్స్ డే వేడుకల్లో 51వ స్క్వాడ్రన్ తరఫున గ్రూప్ కెప్టెన్ సతీష్ పవార్ అవార్డు అందుకోనున్నారు. ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేష్ కుమార్ సింగ్ బదౌరియా అవార్డును అందించనున్నారు.
పాక్ విమానాల సమాచారాన్ని ముందుగానే గ్రహించి భారత వాయుసేన బృందాన్ని అప్రమత్తం చేసిన మింటీ అగర్వాల్ నాయకత్వంలోని 601 సిగ్నల్ యూనిట్‌కి కూడా ఈ అవార్డు అందించనున్నారు. పుల్వామా ఘటన తర్వాత భారత గగనతలంలోకి ప్రవేశించిన పాక్ యుద్ద విమానాలను వెంటాడే క్రమంలో అభినందన్ పాక్ ఆర్మీకి చిక్కిన సంగతి తెలిసిందే. పాక్ సైనికులు అతనిపై దేశరహస్యాల కోసం ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ అభినందన్ వాటిని బయటపెట్టలేదు. ఆ సమయంలో అభినందన్ చూపించిన తెగువ, ఆత్మస్థైర్యం ప్రతీ భారతీయుడిని కదిలించింది. ఈ నేపథ్యంలోనే అభినందన్‌ను వీరచక్ర పురస్కారానికి ఎంపిక చేశారు. భారత 73వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌కు ప్రభుత్వం వీరచక్ర పురస్కారాన్ని కూడా అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment