
అభిషేక్‌కు గన్ పెట్టి.. కారుతో పరార్
అమృత్‌సర్: రోడ్డుపై కారులో వెళ్తున్న ఓ వ్యక్తిని దోపిడీదారులు సినీఫక్కీలో బెదిరించి కారుతో ఉడాయించారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జరిగిన ఈ ఘటన అక్కడ పెరిగిపోతున్న దోపిడీ సంస్కృతికి నిదర్శనంగా ఉంది.
వివరాలు.. అభిషేక్ రల్లి అనే వ్యక్తి బిజెనెస్ పనిమీద ఆగ్రాకు వెళ్లి.. ఆదివారం ఉదయం తన సియజ్ కారులో డ్రైవర్‌తో పాటు స్వస్థలం అమృత్‌సర్‌కు చేరుకుంటున్నాడు. బటాలా రోడ్‌కు చేరుకోగానే.. హోండా సిటీ కారులో వేగంగా వచ్చిన దుండగులు.. అభిషేక్ కారును అడ్డుకున్నారు. తుపాకులతో వచ్చిన నలుగురు దుండగులు.. డ్రైవర్, అభిషేక్‌లను బెదిరించారు. కారు తాళాలు ఇవ్వకపోతే కాల్పులు జరుపుతామని హెచ్చరించారు. దీంతో కారు తాళాలను డ్రైవర్ వారికి అప్పగించాడు. వెళ్తూ వెళ్తూ దుండగులు అభిషేక్ ఫోన్‌ను సైతం తీసుకెళ్లారు. ఈ ఘటనపై డీసీపీ ఎలాంచెజియన్ మాట్లాడుతూ.. మొబైల్ సిగ్నల్ ఆధారంగా దుండగులు అజ్నాలా వైపు పారిపోయినట్లు గుర్తించాము. త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామని అన్నారు.