
సాక్షి, న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ రాజధాని భగ్గుమంటున్నక్రమంలో ఢిల్లీలో నెలకొన్న పరిస్థితి అప్రకటిత ఎమర్జెన్సీయేనని కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళనలు హోరెత్తడంతో ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతంలో పలుచోట్ల 144 సెక్షన్ విధించడం, 18 మెట్రో స్టేషన్లను మూసివేసిన నేపథ్యంలో దేశంలో బీజేపీ పాలన సాగడం లేదని అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని వ్యాఖ్యానించారు. ‘దేశ రాజధానిలో ఎర్రకోట చుట్టూ 144 సెక్షన్ విధించారు, నిషేదాజ్ఞలు అమలు చేస్తున్నారు.
18 మెట్రో స్టేషన్లు మూసివేశారు..ఇంటర్‌నెట్‌ను నిలిపివేశారు..కర్ణాటకలోనూ 144 సెక్షన్ అమలు చేస్తున్నారు..యూపీ, అసోంలో ఇదే తరహా దమనకాండ కొనసాగుతోంద’ని సింఘ్వి అన్నారు. డీ రాజా, సీతారాం ఏచూరి, అజయ్ మాకేన్, సందీప్ దీక్షిత్, యోగేంద్ర యాదవ్,ఉమర్ ఖలీద్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఇది బీజేపీ పాలన కాదు అప్రకటిత ఎమర్జెన్సీ అని దుయ్యబట్టారు. మనుషులను పీక్కుతినేలా బీజేపీ పాలన సాగుతోందని మండిపడ్డారు.
బీజేపీపై దీదీ ఫైర్
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటడంతో బీజేపీ శాంతిని భగ్నం చేసేందుకు కుట్ర పన్నుతోందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ముస్లింలు ప్రార్థనలు నిర్వహించే శుక్రవారం రోజు అల్లర్లకు పాల్పడేందుకు బీజేపీ కార్యకర్తలు ముస్లింలు ధరించే టోపీలు కొనుగోలు చేస్తున్నారని అన్నారు. ఓ వర్గాన్ని అప్రతిష్టకు గురిచేసేందుకు ఈ టోపీలు ధరించి బీజేపీ కార్యకర్తలు ఆస్తులను ధ్వంసం చేసే ఆలోచన చేస్తున్నారని హెచ్చరించారు. పౌర చట్టాన్ని హిందువులు, ముస్లింల మధ్య పోరాటంగా బీజేపీ చిత్రీకరిస్తోందని దీనిపై ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో రిఫరెండం నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు. తన సవాల్‌ను స్వీకరించాలని ఇందులో ఎవరు గెలుస్తారో చూద్దాం..మీరు ఓడిపోతే రాజీనామా చేయాలని అన్నారు. 1980లో పుట్టిన బీజేపీ 1970 నాటి మన పౌరసత్వ పత్రాలను అడుగుతోందని మమతా బెనర్జీ దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment