కోల్‌కతా: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంతో ఉత్సాహంలో మునిగితేలుతున్న బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి ఎసీఎం మమతా బెనర్జీని టార్గెట్‌గా చేసుకుని ‘ఇక మీవంతు’ అని హెచ్చరించారు. కోల్‌కతాతో విలేకరులతో మాట్లాడిన సువేందు అధికారి ‘ఢిల్లీలొ విజయం మనదే.. ఇక 2026లో బెంగాల్ వంతు వస్తుంది’ అని అన్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన చారిత్రాత్మక విజయం దేశానికి ఎంతో అవసరమని, అవినీతి, అబద్ధాల రాజకీయాల ముగింపునకు ఇది నాంది అని సువేందు అధికారి పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, అవినీతికి పాల్పడిందని, దీనికి ఢిల్లీ ప్రజలు తగిన సమాధానం ఇచ్చారని ఆయన అన్నారు.
ఢిల్లీ దేశ రాజధాని అని, దీనిని అంతర్జాతీయ స్థాయి నగరంగా మార్చాల్సివుందని, కానీ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీని నాశనం చేసిందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వ నాయకత్వంలో దేశంలో అభివృద్ధి జరిగినట్లే, ఢిల్లీలో కూడా జరిగి ఉండాల్సిందని ఆయన అన్నారు. బీజేపీ ప్రభుత్వం యమునా ఎక్స్‌ప్రెస్‌వేతో పాటు ఇతర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసిందని, అయితే ఢిల్లీ ప్రభుత్వం వాటిని నిర్వహించడంలో విఫలమైందన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి ఢిల్లీలోని 90 శాతం బెంగాలీ ఓటర్లు బీజేపీకి అనుకూలంగా ఓటు వేశారని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలోని బంగ్లాదేశ్, రోహింగ్యా చొరబాటుదారులకు కేజ్రీవాల్ ప్రభుత్వం ఆధార్ కార్డు, ఓటరు ఐడీ కార్డులను ఇవ్వడం ద్వారా ఉచిత విద్యుత్, నీరు వంటి సౌకర్యాలను అందించిందని, ఇది దేశ భద్రతకు ముప్పు అని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వం ఇలాంటి కార్యకలాపాలకు మద్దతు ఇచ్చినట్లే, ఢిల్లీలో జరిగిన అన్ని దేశ వ్యతిరేక కార్యకలాపాలలో కేజ్రీవాల్ పాత్ర ఉందని ఆయన ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment