అభినవ చాణక్యుడు.. అరుణ్ జైట్లీ
-
వ్యూహ రచనలో దిట్ట..
-
న్యాయ రంగంలో అపార అనుభవం
-
సూటిగా, స్పష్టంగా మాట్లాడే వక్త..
-
బీజేపీలో ట్రబుల్ షూటర్‌గా పేరు
కేంద్ర ప్రభుత్వంలో ప్రధాని మోడీ తరువాత అత్యంత కీలక వ్యక్తుల్లో ఒకరు ఆర్థిక, రక్షణ మంత్రి అరుణ్‌జైట్లీ. ఎంతో ప్రాధాన్యమైన రెండు శాఖలు(ఆర్థిక, రక్షణ) ఆయన నిర్వహిస్తున్నారంటే సమర్ధత అర్థం చేసుకోవచ్చు. ఇతర పార్టీల అధికార ప్రతినిధులు సైతం పలు విషయాల్లో జైట్లీని సలహాలు అడుగుతారట. మోడీ క్యాబినెట్‌లో ఆయన ఓ తురుపు ముక్క. పార్టీ పరంగా ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించే బాధ్యత ఈయనకే అప్పగిస్తుంటారు. మోడీ మాటల్లో చెప్పాలంటే ఆయన ఓ అరుదైన వజ్రం. ప్రకాశ్‌జవదేకర్ మాటల్లో ఓ అద్భుత వ్యూహకర్త. ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యను మోడీ సందర్శించిన సమయంలో రక్షణ మంత్రిగా ఉన్నా ఆయనతో పాల్గొనకుండా పలు సమస్యల పరిష్కారానికి జమ్మూకాశ్మీర్‌కు వెళ్లారు. ఉన్నత పదవుల్లో ఉన్నవారి అడుగులకు మడుగులొత్తడం జైట్లీకి అలవాటు లేదనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే.
న్యాయవాదిగా...
1980లో ఇందిరాగాంధీ అధికారంలోకి వచ్చాక ఢిల్లీలోని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ భవనాన్ని పడగొట్టే ప్రయత్నం చేశారు. దీన్ని కోర్టులో ఎదుర్కొనడంతో పాటు విజయం సాధించారు జైట్లీ. ఈ ఘటన రామనాథ్ గోయంకా, అరున్ శౌరీ, ఫాలీ నారీమన్, స్వామినాథన్ గురుమూర్తి లాంటి వారితో పరిచయానికి దోహదపడింది. 1977 నుంచి లాయర్‌గా పలు కోర్టుల్లో పనిచేశారు. 1990లో సీనియర్ లాయర్‌గా వ్యవహరిస్తు న్నారు. జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న నేతలు శరద్ యాదవ్, ఎల్‌కే అద్వానీ, మాధవరావు సింధియాలకు పలు వివాదాల్లో లాయర్‌గా పనిచేశారు. బిర్లా గ్రూప్ ఆస్తుల వివాదాల్లో, జాతీయగీతం వివాదంపై రామ్‌గోపాల్ వర్మకు కూడా లాయర్‌గా వ్యవహరించారు.
కుటుంబం...
1982లో సంగీతను వివాహం చేసుకున్నారు. రోహన్, సోనాలీ ఇద్దరు సంతానం.
నిర్వహించిన పదవులు...
1986-87లో జనసంఘ్ పార్టీ(ఇప్పుటి భారతీయ జనతా పార్టీ)లో చేరారు. ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ఘటన వీపీసింగ్ దృష్టిలో పడేలా చేసింది. 1989లో సింగ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు అడిషనల్ సోలిసిటర్ జనరల్‌గా జైట్లీని నియమించారు. అప్పటికి ఆ పదవి నిర్వహించిన వారిలో అత్యంత పిన్నవయస్కుడు ఈయనే. 1991 నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గంలో పనిచేస్తున్నారు. 1999లో తొలిసారి ఎన్‌డీఏ ప్రభుత్వంలో లా, సమచార, ప్రసార, పెట్టుబడులు, నౌకాయాన, పరిశ్రమల శాఖల మంత్రిగా పనిచేశారు. స్వతహాగా లాయర్ కావడంతో లా శాఖను ఎంతో సమర్ధవంతంగా నిర్వహించారు. లాయర్లకు వచ్చే ఫీజులో 10 శాతం మొత్తాన్ని వారి కింద పనిచేసే క్లర్కులకు కేటాయించేలా చర్యలు తీసుకున్నారు. ఈ ఫండ్‌తో ఎంతో మంది పిల్లలు ఇంజనీర్లు, డాక్టర్లు కాగలిగారని సీనియర్ లాయర్ ఓమ్ ప్రకాశ్ శర్మ చెప్పారు. 2004లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. తరువాత గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2009లో పార్టీ పదవికి రాజీనామా చేసి రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించారు. 2014 ఎన్నికల్లో అమృత్‌సర్ నుంచి పోటీచేసి ఓటమి చెందారు. గత మేలో కేంద్ర ఆర్థిక, రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
వ్యక్తిగతం...
1952లో జన్మించిన జైట్లీ పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారు. రతన్‌ప్రభ(అమృత్‌సర్), మహరాజ్ కిషన్ జైట్లీ(లాహోర్)లు తల్లిదండ్రులు. తండ్రి ప్రముఖ న్యాయవాది. దేశ విభజన తరువాత వీరు అమృత్‌సర్‌లో స్థిరపడ్డారు. అరుణ్ సెయింట్ గ్జావియర్స్ మిషనరీ స్కూల్ చదివారు. డిగ్రీ, న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. ఎస్‌ఆర్‌సీసీ కాలేజీలో చదివే రోజుల్లో కరంజవాలా అండ్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీనియన్ లాయర్ రయన పరిచయం అయ్యారు. వీరి మధ్య సుదీర్ఘ చర్చలు జరిగేవి. జైట్లీకి అప్పటి నుంచే ఏ అంశం మీదనైనా అనర్ఘళంగా మాట్లాడడం అలవాటైంది. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన సమయంలో ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం(ఏబీవీపీ) అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇది జైట్లీ తొలి విజయం. అప్పుడు ఈయన లా చదువుతున్నారు. అంతేకాదు ఆ సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించడంతో అరెస్టు అయ్యారు కూడా. 19 నెలల జైలులోనే ఉండాల్సి వచ్చింది.