
కస్టడీలో వ్యక్తి మృతి.. పీఎస్‌కు నిప్పు!
పాట్నా: పోలీస్ స్టేషన్లో ఓ నిందితుడు చనిపోవడంతో మృతుడి బంధువులు గందరగోళం సృష్టించారు. పోలీస్ స్టేషన్‌తో పాటు పీఎస్ ప్రాంగణంలో ఉన్న వాహనాలకు నిప్పుపెట్టారు. పాట్నా, భోజ్‌పూర్ జిల్లాలోని బర్హారా గ్రామంలో ఆదివారం ఈ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఓ అధికారి సహా కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ క్షేత్రనిల్ సింగ్ తెలిపారు.
ఎస్పీ కథనం ప్రకారం.. శనివారం రాత్రి నీతు కుమారి(16) అనే యువతి తన తండ్రి తత్వాపై ఫిర్యాదు చేసింది. రోజూ తాగొచ్చి తల్లిని, తనను కొట్టేవాడని చెప్పింది. ఈ క్రమంలో శనివారం రోజు ఇంట్లో తాను మాత్రమే ఉన్న సమయంలో తనను పెళ్లి చేసుకోవాలని వేధించాడని ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదుచేశారు. కొన్ని గంటల్లోనే యువతి తండ్రిని బర్హారా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రికి రాత్రే ఆ వ్యక్తి పోలీస్ కస్టడీలో చనిపోయాడని గ్రామస్థులకు, మృతుడి బంధువులకు తెలిసింది.
ఆదివారం ఉదయం పీఎస్ వద్దకు తీవ్ర ఆవేశంతో వచ్చిన వారు పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడటంతో ఓ పోలీసు తలకు తీవ్ర గాయం కాగా ఆస్పత్రికి తరలించారు. ఆందోళనకారులు స్టేషన్లో నిప్పుపెట్టడంతో కొన్ని ఫైళ్లు కాలిపోయాయి. పీఎస్ ఆవరణలో ఉన్న పోలీస్ జీపుతో సహా మరో రెండు వాహనాలకు గ్రామస్థులు నిప్పుపెట్టడంతో అవి పూర్తిగా దగ్దమయ్యాయి. ఈ ఘటనలో 10 మందిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు ఎస్పీ క్షేత్రనీల్ సింగ్ చెప్పారు.