హైకోర్టు జడ్జి వేధింపులపై మహిళా జడ్జి ఫిర్యాదు | additional sessions judge complains of sexual harassment by high court judge | Sakshi
Sakshi News home page

హైకోర్టు జడ్జి వేధింపులపై మహిళా జడ్జి ఫిర్యాదు

Published Mon, Aug 4 2014 8:51 AM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM

హైకోర్టు జడ్జి వేధింపులపై మహిళా జడ్జి ఫిర్యాదు - Sakshi

హైకోర్టు జడ్జి వేధింపులపై మహిళా జడ్జి ఫిర్యాదు

మహిళలు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా.. తమ పైవాళ్ల నుంచి వేధింపులు తప్పడం లేదని వాపోతున్నారు. గ్వాలియర్లో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా పనిచేస్తున్న ఓ మహిళ.. తనను హైకోర్టు జడ్జి లైంగికంగా వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. ఏకంగా ఓ ఐటెం సాంగ్కు తనను డాన్సు చేయమన్నారని ఆరోపించారు. అయితే.. తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోడానికి ఆమె తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

ఢిల్లీ కోర్టులలో 15 ఏళ్ల పాటు న్యాయవాదిగా పనిచేసిన తర్వాత, ఆమె మధ్యప్రదేశ్ హయ్యర్ జ్యుడీషియల్ సర్వీస్ పరీక్ష రాసి, గ్వాలియర్లో 2011లో పోస్టింగ్ పొందారు. శిక్షణ తర్వాత 2012 చివర్లో అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా గ్వాలియర్లో పోస్టింగ్ పొందారు. 2013లో విశాక కమిటీకి జిల్లా చైర్పర్సన్గా నియమితులయ్యారు. 2014లో ఆమె పనితీరుపై ఇచ్చిన నివేదికలో కూడా ఆమె అద్భుతంగా పనిచేస్తున్నట్లు రాశారు. కానీ.. మధ్యప్రదేశ్ హైకోర్టుకు చెందిన ఓ న్యాయమూర్తి తనను ఒంటరిగా ఆయన బంగ్లాకు రమ్మన్నారంటూ ఆమె ఆరోపించారు. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ ఎం లోధా, న్యాయమూర్తులు జస్టిస్ హెచ్ఎల్ దత్తు, జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ అనిల్ రమేష్ దవే, జస్టిస్  దీపక్ మిశ్రా, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో పాటు మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా ఆమె ఫిర్యాదు చేశారు.

తన ఇంట్లో జరిగే ఓ కార్యక్రమంలో ఐటెం సాంగ్కు డాన్స్ చేయాల్సిందిగా తనకు సందేశం పంపారని ఆమె వాపోయారు. అయితే, తన కూతురి పుట్టిన రోజు ఉందంటూ ఆమె ఆ కార్యక్రమానికి వెళ్లలేదు. దాంతో తర్వాతిరోజు న్యాయమూర్తి నుంచి తనకు మరో మెసేజ్ వచ్చిందని, అందులో.. ''ఒక సెక్సీ, అందమైన ఫిగర్ ఫ్లోర్ మీద డాన్సు చేయడాన్ని నేను మిస్సయ్యాను. అది చూడాలని చాలా కోరికగా ఉన్నాను'' అని ఉన్నట్లు ఆమె ఆరోపించారు. అయితే.. తన మాట వినకపోవడంతో న్యాయమూర్తికి ఆగ్రహం వచ్చిందని, ఎన్ని రకాలుగా పరిశీలించినా తనలో తప్పులు దొరక్కపోవడంతో ఆయన మరింత కోపం తెచ్చుకున్నారని ఆమె అన్నారు. వేధింపులు భరించలేక తాను తన భర్తతో కలిసి న్యాయమూర్తిని కలిసేందుకు వెళ్లగా, తన భర్తను చూసి ఆయనకు చాలా కోపం వచ్చిందని, 15 రోజుల తర్వాత వచ్చి కలవమన్నారని, అయితే ఈలోపే తనను బదిలీ చేశారని చెప్పారు.

తన కుమార్తె సీనియర్ ఇంటర్ చదువుతోందని, మధ్యలో బదిలీ అంటే కష్టమని వేడుకున్నా పట్టించుకోలేదన్నారు. పైపెచ్చు, తనను ఎందుకు బదిలీ చేశారని అడిగితే.. కనీసం ఒక్కసారి కూడా బంగ్లాకు రానందుకు తన కెరీర్ మొత్తాన్ని నాశనం చేస్తానన్నారని, జీవితాంతం ఇందుకు బాధపడాల్సి వస్తుందన్నారని ఆమె ఆరోపించారు. ఈ విషయం చెప్పేందుకు ప్రయత్నించగా, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తనను కలవడానికి నిరాకరించారన్నారు. దాంతో ఇక తాను ఏమీ చేయలేని పరిస్థితిలో జ్యుడీషియల్ సర్వీసుకు రాజీనామా చేయక తప్పలేదని ఫిర్యాదులో తెలిపారు.

సహోద్యోగులు అందరినీ సోదర, సోదరీమణులుగా పిలిచే ఏకైక వృత్తి ఇదేనని, కానీ ఇక్కడ కూడా ఇలా జరగడం దురదృష్టకరమని, తన వద్దకు ఫిర్యాదు వచ్చిన తర్వాత తగిన చర్య తీసుకుంటానని ఈ ఫిర్యాదుపై జస్టిస్ లోధా అన్నారు.

(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement