'ఆరు వారాలు అశ్లీల చిత్రాలను పరిశీలించండి'
న్యూఢిల్లీ: కండోమ్ ప్యాకెట్ల మీద, వాటికి సంబంధించిన ప్రకటనల్లో మహిళల అసభ్య ఫొటోలను ముద్రిస్తూ, అశ్లీలతతో కూడిన ప్రకటనలు గుప్పిస్తు ప్రజలను చెడుతోవ పట్టిస్తున్నారని పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందుతుండటాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా భావించింది. ఈ విషయంలో కండోమ్ తయారీ కంపెనీలకు, ప్రకటనకర్తలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఆయా ప్రకటనల్లో అశ్లీలతపై పరిశీలన చేయాలని అదనపు సొలిసిటర్ జనరల్ ఏఎస్ జీ) మనీందర్ సింగ్ ను ఆదేశించింది.
వీటిని నియంత్రించేందుకు మీ దగ్గర ఏవైనా ప్రణాళికలు ఉన్నాయా? అని ఏఎస్ జీని ప్రశ్నించిన సుప్రీం ధర్మాసనం.. ఆ మేరకు సూచనలు ఇవ్వాలని కోరింది. 'ఆరు వారాలు ఆ ప్రకటనలను నిశితంగా పరిశీలించి అభిప్రాయం చెప్పండి' అని ఏఎస్ జీని సుప్రీం కోరినట్లు పలు జాతీయ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. అయితే ఏఎస్ జీ మనీందర్ సింగ్ కార్యాలయం మాత్రం దీనిపై స్పందించేందుకు విముఖత ప్రదర్శించింది. మంగళవారం సుప్రీం కోర్టు నుంచి ఉత్తర్వులు అందాయని మాత్రం తెలిపింది. మనీందర్ సింగ్ ప్రభుత్వ పరంగా మూడో అత్యున్నత న్యాయాధికారి కావడంతో కాండోమ్ ప్రకటనలపై ఆయన ఎలాంటి సూచనలు చేస్తారనేదానిపై సర్వత్రా ఆసక్తినెలకొంది.