
దేశంలో లైంగిక దాడి ఘటనలు పెచ్చుమీరాయని మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ విరుచుకుపడింది.
సాక్షి, న్యూఢిల్లీ : మహిళలపై నేరాలు పెచ్చుమీరుతున్నా ప్రధాని నరేంద్ర మోదీ మౌనంగా ఉన్నారని సీనియర్ కాంగ్రెస్ నేత పార్లమెంట్‌లో ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై నేరాల తీరు చూస్తుంటే మనం మేకిన్ ఇండియా దిశగా కాకుండా రేపిన్ ఇండియా వైపు పయనిస్తున్నామనే సందేహం కలుగుతోందని లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి అన్నారు. ప్రతి అంశంపైనా మాట్లాడే ప్రధాని మహిళలపై నేరాల గురించి మాత్రం నోరు మెదపకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. దేశం క్రమంగా లైంగిక దాడులకు కేంద్రంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దిశ హత్యాచార ఘటన, ఉన్నావ్ లైంగిక దాడి ఘటనలు దేశంలో కలకలం రేపాయని అన్నారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ను ప్రజలు వేడుకగా జరుపుకున్నారని గుర్తు చేశారు. నిందితుల ఎన్‌కౌంటర్‌పై విమర్శలు చెలరేగినా పెద్ద సంఖ్యలో ప్రజలు స్వాగతించారని, సీనియర్ రాజకీయ నేతలు సైతం పోలీసుల చర్యను సమర్ధించారని చెప్పారు.