లక్నో : బిహార్‌లోని ముజఫర్‌పూర్ బాలికల వసతి గృహంలో మైనర్ బాలికలపై లైంగిక దాడుల ఘటన అనంతరం యూపీలోనూ ఈ తరహా ఘోరం వెలుగుచూసింది. డియోరియా జిల్లాలో మహిళలు, బాలికల సంరక్షణ గృహంలో అకృత్యాలు చోటుచేసుకున్నాయని పోలీసులు వెల్లడించారు.
వసతి గృహంపై దాడి చేసి 24 మంది బాలికలను కాపాడామని, షెల్టర్ హోం నిర్వాహకులైన కాంచన్ లతా, గిరిజా త్రిపాఠి, మోహన్ త్రిపాఠిలను అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ రోహన్ పీ కనాయ్ తెలిపారు. వసతి గృహం రికార్డులను పరిశీలించగా 18 మంది బాలికలు కనిపించడం లేదని వెలుగు చూసిందన్నారు. వారి ఆచూకీ గురించి నిందితులను తాము ప్రశ్నిస్తున్నామన్నారు. కాపాడిన బాలికలపై వైద్య పరీక్షలు చేపడుతున్నామని తెలిపారు.
సీఎం సీరియస్
డియోరియా షెల్టర్ హోంలో బాలికలపై లైంగిక వేధింపుల ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ తీవ్రంగా స్పందించారు. చిన్నారులపై అకృత్యాలకు పాల్పడిన ఘటన వెలుగు చూసిన నేపథ్యంలో జిల్లా మేజిస్ర్టేట్ సుజిత్ కుమార్, ప్రొబేషన్ అధికారి ప్రభాత్ కుమార్‌లను సస్పెండ్ చేసినట్టు సీఎం ప్రకటించారు.
వేధింపులిలా..
వసతి గృహం నుంచి తప్పించుకుని వచ్చిన పదేళ్ల బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో షెల్టర్ హోంలో అకృత్యాలు వెలుగుచూశాయి. ప్రతిరోజూ సాయంత్రం షెల్టర్ హోంకు తెలుపు, నలుపు, ఎరుపు రంగు కార్లు వస్తాయని, అక్కడి బాలికలను తీసుకుని వెళతాయని బాలిక వివరించినట్టు పోలీసులు తెలిపారు. ఉదయాన్నే బాలికలు ఏడస్తూ వసతి గృహానికి చేరుకునేవారని అక్కడి దారుణాన్ని బాలిక కళ్లకు కట్టింది. ప్రభుత్వ ఉత్తర్వులను ధిక్కరిస్తూ ఈ హోం నడుస్తోందని పోలీసులు చెబుతున్నారు.
వసతి గృహంలో అక్రమాలు జరుగుతున్నాయని సీబీఐ గుర్తించడంతో జూన్ 2017న షెల్టర్ హోం గుర్తింపును ప్రభుత్వం రద్దు చేసిందని డియోరియా ఎస్పీ చెప్పారు. అయితే హైకోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చిందంటూ హోంను మేనేజర్ నిర్వహిస్తున్నారని తెలిపారు. కోర్టు ఉత్తర్వులు చూపించమని కోరగా మేనేజర్ నిరాకరించారని చెప్పారు. షెల్టర్ హోం నుంచి బాలికలను తరలించేందుకు అధికారులు ప్రయత్నించగా మేనేజర్ సహకరించలేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment