ఐ క్రియేట్ కేంద్రాన్ని ప్రారంభించిన భారత్-ఇజ్రాయెల్ ప్రధానులు మోదీ, నెతన్యాహు, చిత్రంలో నెతన్యాహు సతీమని, గుజరాత్ సీఎం రూపానీ, డిప్యూటీ సీఎం నితిన్ పటేల్‌లు కూడా ఉన్నారు.
అహ్మదాబాద్ : ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఎంటర్‌ప్రెన్యుర్షిప్ అండ్ టెక్నాలజీ.. సింపుల్‌గా చెప్పాలంటే ‘ఐ క్రియేట్’ ! దేశప్రజల అవసరాలకు తగ్గట్లు నూతన సాంకేతిక పరిజ్ఞానంతో అంకురించే సంస్థలకు చేదోడుగా, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకరంగా ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో ఏర్పాటయిందే.. ‘ఐ క్రియేట్’ ఇంక్యుబేషన్ సెంటర్.
గుజరాత్‌లోని అహ్మదాబాద్ శివారు డియోధోలెరా గ్రామంలో సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కేంద్రాన్ని భారత-ఇజ్రాయెలీ ప్రధానులు సంయుక్తంగా బుధవారం ప్రారంభించారు. తొలిరోజే ఇరు దేశాలకు చెందిన 38 ప్రాజెక్టులకు ఆమోదం పొందాయి. వీటిలో 18 భారత్‌కు చెందిన ప్రాజెక్టులుకాగా, 20 ఇజ్రాయెల్ ఎంటర్‌ప్రెన్యూర్లు రూపొందించినవి.
జై భారత్, జై ఇజ్రాయెల్ : ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాట్లాడుతూ.. ‘‘ఐ ఫోన్, ఐ ప్యాడ్‌ల తర్వాత ప్రపంచమంతా దృష్టిసారించబోయేది ‘ఐ క్రియేట్’ సెంటర్‌పైనే! ఇండియా-ఇజ్రాయెల్‌ల సహకారాత్మక ప్రయాణంలో ఐ క్రియేట్ ఏర్పాటు ఒక కీలక ముందడుగు. జైహింద్, జై భారత్, జై ఇజ్రాయెల్!’’ అని అన్నారు.
ఐ.. చాలా కీలకం : ‘‘ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఎంటర్‌ప్రెన్యుర్షిప్ అండ్ టెక్నాలజీని షార్ట్‌గా i-CREAT అని వ్యవహరిస్తున్నాం. ఇందులో ‘ఐ’ చిన్న అక్షరంగా ఉంచడానికి కారణం ఉంది. ఇంగ్లీష్‌లో ఐ అంటే నేను. ఈ నేను అనే అహాన్ని వీడటం చాలా కష్టమైనపని. ఒక్కసారి దాన్ని అధిగమించామా ఇక తిరుగుండదు. అప్పుడు ఐ అంటే మనం అనే భావన వస్తుంది. తక్కువ ఖర్చుతో పేదల జీవితాల్లో మార్పులు తీసుకురాగల ఎన్నో ఆవిష్కరణకు ఐ క్రియేట్ కేంద్రంగా నిలవనుంది’’ అని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
యువ ఆవిష్కర్తలతో మోదీ-నెతన్యాహు
Comments
Please login to add a commentAdd a comment