దేశీ మార్కెట్లోకి సోనియాపై వివాదాస్పద పుస్తకం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జీవిత చరిత్రకు కాస్త కల్పన జోడించి స్పెయిన్ రచయిత జేవియర్ మోరో రాసిన వివాదాస్పద ‘ఎల్ సారీ రోజో’ పుస్తకం ఎట్టకేలకు భారత మార్కెట్లో ‘రెడ్ శారీ’ పేరిట విడుదలైంది. ఇందులోని అంశాలపై కాంగ్రెస్ పార్టీ గతంలో అభ్యంతరం వ్యక్తం చేయడంతో దేశంలో ఈ పుస్తకాన్ని ఎవరూ ప్రచురించలేదు.
స్పానిష్ భాషలో తొలుత 2008లో విడుదలైన ఈ పుస్తకంలో అభూతకల్పనలు, అర్ధ సత్యాలు, పరువునష్టం కలిగించే అంశాలు ఉన్నాయని ఆరోపిస్తూ సోనియా తరఫు న్యాయవాదులు 2010లో మోరోకు లీగల్ నోటీసు పంపారు. సోనియా ఆప్తమిత్రులు, సహచరుల నుంచి సేకరించిన సమాచారాన్ని మోరో ఈ పుస్తకంలో పొందుపరిచారు. సోనియా బాల్యం, రాజీవ్‌గాంధీతో ప్రేమాయణం, ఇందిరాగాంధీ కోడలు కావడం, ప్రధాని అవకాశాన్ని తిరస్కరించడం వంటి అంశాలను ఇందులో స్పృశించారు.