రూ. 382 కోట్లు తరలించాల్సిన బోగీ కిటికీ ఊచలు తొలగించిన వైనం
సాక్షి ప్రతినిధి, చెన్నై: సేలం-చెన్నై ఎగ్మూరు రైలు నుంచి రూ.5.75 కోట్లు దోపిడీకి గురై 24 గంటలు గ డవకముందే తమిళనాడులో అలాంటిదే మరో భారీచోరీ యత్నం బయట పడింది. రూ.382.67 కోట్ల నగదుతో తిరుచ్చి నుంచి చెన్నైకి బయలుదేరాల్సిన రైలు బోగీ కిటికీ ఊచలను గుర్తుతెలియని వ్యక్తులు తొలగించారు. చినిగిపోయిన, పాతబడిన నోట్లను(విలువ రూ. 382.67 కోట్లు) వివిధ బ్యాంకుల నుంచి సేకరించిన ఆర్‌బీఐ, మంగళవారం రాత్రి డబ్బును చెన్నైకు తరలించాల్సి ఉంది.
తిరుచ్చిలో బోగీలోకి ఎక్కించి, బోగీని మంగళూరు-ఎగ్మూరు వయా తిరుచ్చి రైలుకు తగిలించాల్సి ఉంది. డబ్బును చెక్కపెట్టెల్లో పెట్టి, బోగీలో అమర్చేందుకు అధికారులు తిరుచ్చి స్టేషన్‌కు చేరుకున్నారు. సేలం-ఎగ్మూరు ఘటననేపథ్యంలో.. బోగీని క్షుణ్నంగా తనిఖీ చేయగా ఒక కిటికీ ఊచలను గుర్తుతెలియని దుండగులు తొలగించినట్లు గుర్తించారు. దీంతో మరో బోగీని సిద్ధం చేసి డబ్బును చెన్నైకి తరలించారు.