సదస్సుకు ఎజెండా సిద్ధం
బెంగళూరు: కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరుగుతున్న పార్టీ జాతీయ కార్యవర్గ సదస్సులో చేపట్టాల్సిన అంశాలను (ఎజెండాను) ఖరారు చేసేందుకు బీజేపీ జాతీయ పదాధికారులు గురువారం బెంగళూరులో సమావేశమయ్యారు. పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా ఈ సమావేశాన్నుద్దేశించి ప్రసంగిస్తూ.. దాదాపు 10 కోట్ల మందిని పార్టీ సభ్యులుగా నమోదు చేయించటంతో బీజేపీ ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా అవతరించిందని పేర్కొన్నారు. పలు రాష్ట్రాల్లో ఏడెనిమిది రెట్లు ఎక్కువగా సభ్యత్వ నమోదు జరిగిందంటూ.. ఇందుకు కృషి చేసిన పార్టీ విభాగాలను షా అభినందించారు. ఈ విషయంలో పార్టీ అధ్యక్షుడి కృషిని పలువురు పార్టీ నేతలు ప్రశంసించారు.
ఈ నెల 3, 4 తేదీల్లో జరగనున్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రవేశపెట్టనున్న తీర్మానాలపై ఈ భేటీలో చర్చించారు. ఇందులో ఒకటి దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను, మోదీ ప్రభుత్వం నేతృత్వంలో సాధించిన విజయాలను గురించిన తీర్మానం. రెండోది.. మోదీ సారథ్యంలో దేశ విదేశాంగ విధానం విజయవంతం కావటాన్ని గురించి చెప్పే తీర్మానం. ఈ నెల 6వ తేదీన పార్టీ వ్యవస్థాపక దినోత్సవం, 14వ తేదీన అంబేద్కర్ జయంతి నిర్వహణలతో పాటు.. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏడాది నిండే సందర్భంగా మే 26న చేపట్టాల్సిన కార్యక్రమాలను, జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం నిర్వహణ తదితర అంశాలపైనా పదాధికారుల భేటీలో చర్చించారు.
పార్టీ అత్యున్నతం.. ప్రభుత్వం సాధనం
పార్టీ జాతీయ కార్యవర్గ సదస్సుకు హాజరయ్యేందుకు ప్రధానిమోదీ గురువారం మధ్యాహ్నానికే చేరుకున్నారు. ఆయన సాయంత్రం 4 గంటల సమయంలో పార్టీ పదాధికారుల సమావేశానికి హాజరయ్యారు. పదాధికారులనుద్దేశించి మాట్లాడుతూ.. ఓటర్లు పార్టీ సభ్యులుగా మారటం పట్ల మోదీ హర్షం వ్యక్తం చేశారు. పార్టీయే అత్యున్నతమని.. దాని లక్ష్యాలను సాధించటానికి ప్రభుత్వం ఒక సాధనమని అభివర్ణించారు.
నేడు, రేపు జాతీయ కార్యవర్గ భేటీ...
బీజేపీ జాతీయ కార్యవర్గ సదస్సు శుక్రవారం బెంగళూరులో ప్రారంభం కానుంది. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ప్రారంభోపన్యాసం చేస్తారని, ప్రధానమంత్రి మోదీ సదస్సుకు అధ్యక్షత వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ సీనియర్ నేతలతో పాటు 111 మంది సభ్యుల కార్యవర్గం, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీకి చెందిన మాజీ ముఖ్యమంత్రులు, ఇతర ఆహ్వానితులు హాజరవుతారు. అలాగే.. శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు నగరంలోని నేషనల్ కాలేజ్ గ్రౌండ్స్‌లో పార్టీ బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. ఇదిలావుంటే.. పార్టీ సీనియర్ నేత ఎల్.కె.అద్వానీ ఈ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ముగింపు ప్రసంగం చేస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
కాంగ్రెస్ కార్యకర్తలూ
సెలవు తీసుకున్నట్లున్నారు...
సాక్షి, బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్‌గాంధీతో పాటు ఆ పార్టీ కార్యకర్తలు కూడా సెలవు తీసుకున్నట్లున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షానవాజ్‌హుసేన్ ఎద్దేవాచేశారు. సభ్యత్వ నమోదుకు సంబంధించి బీజేపీ తప్పుడు సమాచారం ఇస్తూ అతిపెద్ద పార్టీ అని గొప్పలు చెప్పుకుంటోందన్న కాంగ్రెస్ విమర్శలపై ఆయన స్పందిస్తూ.. ‘‘కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీ పై విమర్శలు చేయడం మానేసి తమ పార్టీని ఎలా బలోపేతం చేసుకోవడం పై దృష్టి సారిస్తే బాగుంటుంది’’ అని విమర్శించారు.