
మాస్క్ మురికిగా ఉందంటూ...
న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియా మరోసారి వార్తల్లోకి ఎక్కింది. కాక్పిట్లోని ఎమర్జెన్సీ ఆక్సిజన్ మాస్క్ శుభ్రంగా లేదని పైలెట్ విమానాన్ని నడిపేందుకు నిరాకరించాడు. దాంతో విమానం మూడు గంటల పాటు నిలిచిపోయింది. వివరాల్లోకి వెళితే దీంతో 467 మంది ప్రయాణికులతో ఢిల్లీ నుంచి కొచ్చికి బుధవారం ఉదయం 5.35 గంటలకి బయలుదేరాల్సి ఉంది. అయితే మాస్క్ మురికిగా ఉందంటూ ఎయిర్ ఇండియా కెప్టెన్ ...విమానాన్ని నడిపేందుకు తిరస్కరించాడు.
దాంతో విమాన సిబ్బంది ఆ మాస్క్ను కోలిన్తో శుభ్రపరిచినా పైలెట్ మాత్రం తన పట్టువీడలేదు. ఇంత చిన్న కారణంగా ప్రయాణికుల్ని ఇబ్బంది పెట్టవద్దని సిబ్బంది కోరినా పైలెట్ మాత్రం తాజా మాస్క్ ఉంటేనే అని షరతు పెట్టాడు. దాంతో ప్రయాణికులు మూడు గంటలపాటు పడిగాపులు పడాల్సి వచ్చింది. ఈ సంఘటన ఇతర విమాన సర్వీసులపై కూడా ప్రభావాన్ని చూపింది. మరోవైపు దీనిపై ఎయిర్ ఇండియా ఛైర్మన్ రోహిత్ నందన్ స్పందిస్తూ ఇలాంటి సిల్లీ విషయాల కారణంగా విమానాలను ఆలస్యంగా నడిపితే సహించేది లేదని స్పష్టం చేశారు. దీనిపై విచారణకు ఆదేశించారు.