
‘రెండాకుల’ కోసం 50 కోట్లు!
► ఎన్నికల అధికారికి శశికళ మేనల్లుడు దినకరన్ లంచం
► 1.30 కోట్లతో బ్రోకర్ అరెస్ట్
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఏఐఏడీఎంకే పార్టీ చిహ్నం రెండాకులను దక్కించుకునేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) అధికా రికి శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ భారీ ఎత్తున లంచం ఇవ్వజూపారు. ఈ వ్యవహా రానికి సంబంధించి ఢిల్లీ పోలీసులు సోమ వారం దినకరన్‌పై కేసు నమోదు చేసి.. మధ్య వర్తిని అరెస్టు చేశారు. ఎన్నికల అధికారి ఒకరికి దినకరన్ రూ. 50 కోట్ల లంచం ఇవ్వడానికి సిద్ధమయ్యారని ఢిల్లీ పోలీ సులు చెప్పారు. దినకరన్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇది శశికళ వర్గానికి దెబ్బగా భావిస్తున్నారు.
మధ్యవర్తి వద్ద రూ. 1.30 కోట్లు అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తరువాత పార్టీ శశికళ, పన్నీర్‌సెల్వం వర్గాలుగా చీలిపోయిన విషయం తెలిసిందే. పార్టీ పేరు, రెండాకుల చిహ్నంపై ఎన్నికల కమిషన్ తాత్కాలికంగా నిషేధం విధించింది. దీనిపై సోమవారం ఢిల్లీలోని సీఈసీ కార్యాలయం విచారణ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో, రెండాకుల చిహ్నం కోసం ఢిల్లీలోని ఒక ఐదు నక్షత్రాల హోటల్‌లో దినకరన్ తరఫున బేరసారాలు సాగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు అక్కడికి చేరుకోగా కర్ణాటకకు చెందిన సుఖేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తి వద్ద లంచంలో అడ్వాన్స్‌గా ఇచ్చిన రూ.1.30 కోట్లు పట్టుబడింది.
అతని నుంచి బెంజ్, బీఎండబ్ల్యూ కార్లు స్వాధీనం చేసుకున్నారు. సుఖేష్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఎన్నికల కమిషన్ కార్యాలయానికి చెందిన ఒక అధికారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి, ప్రస్తుతం ఢిల్లీలో ఒక ముఖ్యమైన పదవిలో ఉన్న అధికారి తనతో మాట్లాడారని, ఎన్నికల కమిషన్ కార్యాలయంలోని తన బంధువు చంద్రశేఖర్ ద్వారా పనులు చక్కబెడుతుంటానని సుఖేష్ పోలీసులకు తెలిపినట్లు సమాచారం. సుఖేష్‌పై దేశవ్యాప్తంగా పలు మోసం కేసులుండగా, రెండుసార్లు పట్టుబడ్డాడు. తాజా కేసులో సుఖేష్ ప్రేయసి, నటి లీనాను సైతం అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.