339 రూపాయలకే విమాన టికెట్!!
చెన్నై నుంచి బెంగళూరు వెళ్లాలంటే ఎంత ఖర్చువుతుంది? రైల్లో వెళ్తే స్లీపర్ క్లాస్ అయితే 230 రూపాయల నుంచి ఫస్ట్ క్లాస్ ఏసీ అయితే 1360 రూపాయల వరకు అవుతుంది. ప్రయాణ సమయం కూడా సూపర్ ఫాస్ట్ రైలు అయితే.. అది కూడా రైలు ఆలస్యం కాకపోతే కనీసం ఆరు గంటలు పడుతుంది. అదే మీరు విమానం ఎక్కితే జస్ట్ 339 రూపాయలు చెల్లిస్తే చాలు.. ప్రశాంతంగా కూర్చుని హాయిగా అరగంటలోనో గంటలోనో వెళ్లిపోవచ్చు. ఏంటి, దీనిక అదనంగా పన్నులు ఉంటాయిలే అనుకుంటున్నారా? ఒక్క పైసా కూడా మీరు అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు. 339 రూపాయలిచ్చి చెన్నై నుంచి బెంగళూరుకు విమానంలో వెళ్లిపోవచ్చు. అదే బెంగళూరు నుంచి చెన్నైకి మాత్రం టికెట్ ధర 490 రూపాయలు.
తక్కువ ఖరీదుతో విమానయానాన్ని అందించాలని తలపెట్టిన ఎయిర్ ఏషియా ఇండియా సంస్థ ఈ సరికొత్త ఆఫర్తో తన సేవలు ప్రారంభించింది. ఒక్కో రూటుకు ఒక్కో ధరను ఈ సంస్థ నిర్ణయించింది. బెంగళూరు నుంచి గోవా వెళ్లాలంటే పన్నులతో కలిపి 990 రూపాయలు చెల్లించాలి. శుక్రవారం ఉదయం 9.30 గంటల నుంచి టికెట్ బుకింగ్ మొదలైపోయింది. ఇప్పటికే చాలావరకు టికెట్లు అయిపోయాయి కూడా. కొన్ని తేదీలకు మాత్రం ఇంకా మిగిలే ఉన్నాయి. అయితే, హైదరాబాద్ నుంచి మాత్రం ఈ విమానయాన సంస్థ సర్వీసులు ఇంకా ప్రారంభం కాలేదు. అందువల్ల దేశంలోని మిగిలిన నగరాలకు సంబంధించి మాత్రమే టికట్లు బుక్ చేసుకోవచ్చు.
మే 30 నుంచి జూన్ 1వ తేదీ వరకు మాత్రమే ఈ బుకింగ్ ఆఫర్ అమలులో ఉంటుంది. ప్రయాణం మాత్రం జూన్ 12 నుంచి అక్టోబర్ 15 వరకు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. మలేషియా విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా, టాటా సన్స్, టెలెస్ట్రా ట్రేడ్ప్లేస్.. ఇవన్నీ కలిసి సంయుక్తంగా ప్రారంభించిన ఎయిర్ ఏషియా ఇండియా సంస్థకు డీసీసీఏ నుంచి ఫ్లయింగ్ లైసెన్స్ అంత సులభంగా దొరకలేదు. ఎట్టకేలకు తొమ్మిది నెలలు వేచి ఉన్న తర్వాత పలు అడ్డంకులు అధిగమించి ఇప్పుడు గాల్లో ఎగరబోతోంది.