cheap airlines
-
చైనా ఫోన్లే కాదు.. విమానాలూ చౌకే!
విదేశాలకు వెళ్లడానికి చార్జీలు ఎక్కువగా ఉన్నాయని బాధపడుతున్నారా? ప్రముఖ విమానయాన సంస్థలు అప్పుడప్పుడు ఆఫర్లు ప్రకటించినా, అవన్నీ స్వదేశీ విమానయానానికే చాలావరకు పరిమితం అవుతున్నాయి. కొన్ని మాత్రం విదేశాలకు ఆఫర్లు ఇస్తున్నా, అవన్నీ దగ్గర దేశాలకే. దూర ప్రాంతాలకు వెళ్లాలంటే మాత్రం టికెట్ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని బాధపడేవారికి ఇదో అవకాశం. చైనా సదరన్ ఎయిర్‌లైన్స్ వాళ్లు చాలావరకు చవగ్గా విమానయానాలు అందిస్తున్నారట. ఢిల్లీ నుంచి లాస్ ఏంజెలిస్ వెళ్లడానికి ఇతర ఎయిర్‌లైన్స్ సంస్థలు రూ. 65వేలు టికెట్ తీసుకుంటే, చైనా సదరన్ ఎయిర్‌లైన్స్ (సీఎస్ఏ) టికెట్ 58వేలు మాత్రమే ఉందట. ఒక్క అమెరికాకే కాదు.. భారతదేశం, మధ్యప్రాచ్యం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్.. ఇలా చాలా దేశాలకు తక్కువ ధరలకే టికెట్లు ఆఫర్ చేస్తోంది. దాంతో భారతీయ ప్రయాణికులు ఇప్పుడు చైనా ఫోన్లతో పాటు చవగ్గా వస్తున్న చైనా విమానటికెట్ల వైపు కూడా మొగ్గు చూపుతున్నారు. భారత్ నుంచి ఈ విమానాల్లో వెళ్లేవారి సంఖ్య ఇటీవల కొన్నేళ్ల నుంచి బాగా పెరిగిందని థామస్ కుక్ సంస్థ ప్రెసిడెంట్ ఇందీవర్ రస్తోగీ చెప్పారు. చవగ్గా టికెట్లు ఇస్తున్నాం కదాని విమానాలు కూడా చౌకబారుగా ఉంటాయనుకుంటే తప్పే. వాటిలో సౌకర్యాలు కూడా బాగానే ఉంటున్నాయట. దూర ప్రాంతాలకు వెళ్లడానికి టికెట్ల ధరలు సింగపూర్ ఎయిర్‌లైన్స్, థాయ్ ఎయిర్వేస్, మలేసియన్ ఎయిర్‌లైన్స్ కంటే ఇందులో కనీసం 20 నుంచి 25 వేల వరకు ఇందులో తక్కువగా ఉంటున్నాయని రస్తోగీ చెప్పారు. అయితే, భారతీయ మార్కెట్లోకి నేరుగా ప్రవేశించే అవకాశం వీళ్లకు మరీ ఎక్కువగా లేకపోవడంతో ఎయిరిండియా సహా పలు భారతీయ ఎయిర్‌లైన్స్ బతికిపోతున్నాయి. వారానికి 42 విమానాల్లో 10వేల సీట్లు మాత్రమే అమ్ముకోడానికి వీలు కల్పించేలా ఇండియా - చైనాల మధ్య విమానయానానికి సంబంధించి ఒక ద్వైపాక్షిక ఒప్పందం ఉంది. దీన్ని చైనా సంస్థలు పూర్తిగా వాడుకుంటుండగా, భారతదేశం మాత్రం కేవలం 5 విమానాలే నడిపిస్తూ 1280 సీట్లు మాత్రమే అమ్ముకుంటోంది. ధరల్లో తేడాలు ఇలా ఉన్నాయి.. ఢిల్లీ-సిడ్నీ: చైనా సదరన్ (సీఎస్): రూ. 44,500 (వయా గువాంగ్జు) ఎయిరిండియా: రూ. 69వేలు (డైరెక్ట్) ఢిల్లీ-ఆక్లండ్: సీఎస్: రూ. 48,900 (వయా గువాంగ్జు) ఎయిరిండియా: రూ. 68,400 (వయా సిడ్నీ) ఎంఎ: రూ. 70,500 (వయా కౌలాలంపూర్) ఢిల్లీ-టోక్యో సీఎస్: రూ. 34,000 (వయా గువాంగ్జు) ఏఎన్ఏ : రూ. 39,400 థాయ్: రూ. 42,000 (వయా బ్యాంకాక్) ఢిల్లీ-శాన్ ఫ్రాన్సిస్కో: సీఎస్: రూ. 60,300 (వయా గువాంగ్జు) గల్ఫ్ విమానాలు: ప్రారంభం రూ. 72 వేలు -
ప్రపంచంలో అతిపెద్ద చౌక ఎయిర్‌లైన్స్ కూటమి!
‘వేల్యూ అలయెన్స్’ టేకాఫ్... సింగపూర్: చౌక విమానయాన సేవలకు అంతకంతకూ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో... ప్రపంచంలోనే అతిపెద్ద బడ్జెట్ ఎయిర్‌లైన్స్ కూటమి(అలయెన్స్) ఆవిర్భవించింది. ఆగ్నేయాసియా, జపాన్, ఆస్ట్రేలియాలకు చెందిన ఎనిమిది బడ్జెట్ ఎయిర్‌లైన్స్ కలిసి ‘వేల్యూ అలయెన్స్’ పేరుతో దీన్ని ఏర్పాటు చేసుకున్నట్లు సోమవారమిక్కడ ప్రకటించాయి. ఈ విమానయాన కంపెనీలకు చెందిన టికెటింగ్ ప్లాట్‌ఫామ్ షేరింగ్ ద్వారా ప్రయాణికులు ఎక్కడి నుంచి ఎక్కడికైనా టికెట్లను బుక్ చేసుకోవడాకి వీలుకల్పించనుండటం ఈ అలయెన్స్ ప్రత్యేకత. అంటే.. ఈ ఎనిమిది కంపెనీలకు చెందిన ఏ వెబ్సైట్ ద్వారానైనా అన్ని సంస్థల ఫ్లైట్లు, టారిఫ్‌లు, ఇతరత్రా వివరాలన్నీ తెలుసుకోవచ్చు. అంతేకాకుండా.. సంబంధిత వెట్‌సైట్ ద్వారా ఒకే లావాదేవీతో టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని వేల్యూ అలయెన్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రపంచంలోనే అతిపెద్ద చౌక విమానయాన సంస్థల కూటమిగా దీన్ని అభివర్ణించింది. అలయెన్స్‌లో సింగపూర్ ఎయిర్‌లైన్స్ అనుబంధ సంస్థ ‘స్కూట్’, ఫిలిప్పైన్స్కు చెందిన సెబు ఫసిఫిక్, దక్షిణ కొరియా జేజు ఎయిర్, థాయ్‌లాండ్ నోక్ ఎయిర్, నోక్స్కూట్; టైగర్ ఎయిర్ సింగపూర్, టైగర్ ఎయిర్ ఆస్ట్రేలియా, జపాన్ సంస్థ వెనీలా ఎయిర్‌లు ఉన్నాయి. ఈ అలయెన్స్‌లో మొత్తం విమానాల సంఖ్య 176 కాగా, 160 గమ్య స్థానానాలకు సర్వీసులను అందించనుంది. గతేడాది ఈ కూటమి సభ్య కంపెనీలు 17 ప్రధాన కేంద్రాల(హబ్స్) ద్వారా 4.7 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించింది. ఆగ్నేయాసియాలో అతిపెద్ద బడ్జెట్ ఎయిర్‌లైన్స్ ఎయిర్ఏషియా, ఆస్ట్రేలియా కాంటాస్ ఎయిర్వేస్, భారత్ చౌక విమానయాన దిగ్గజం ఇండిగోలు ఈ అలయెన్స్‌కు దూరంగా ఉన్నాయి. -
రూ. 1,799కే ఎయిర్ కోస్టా టికెట్లు!
సంక్రాంతి సందర్భంగా విమానయాన సంస్థ ఎయిర్ కోస్టా కొత్త ఆఫర్ ప్రకటించింది. 'హ్యాపీ సంక్రాంతి' పేరుతో తక్కువ ధరకే విమాన యానం అందించే ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. పండుగలు, సెలవులను దృష్టిలో పెట్టుకుని రూ. 1,799 నుంచే టికెట్లను అందిస్తున్నట్లు ఎయిర్ కోస్టా సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. జనవరి 12 మధ్యాహ్నం 3 గంటల నుంచి జనవరి 15 మధ్యాహ్నం 3 గంటలలోపు బుక్ చేసుకున్నవారికి మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుంది. ఈ ఆఫర్ సమయంలో బుక్ చేసుకున్న టికెట్లతో ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 15లోగా ఎప్పుడైనా ప్రయాణం చేయొచ్చు. -
ఎయిర్ కోస్టా న్యూ ఇయర్ ఆఫర్లు
రాబోయే కొత్త సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకుని ఎయిర్ కోస్టా ఎంపిక చేసిన రూట్లలో ప్రత్యేక తగ్గింపు ఆఫర్లను ప్రకటించింది. డిసెంబర్ 11 మధ్యాహ్నం మూడు గంటల నుంచి డిసెంబర్ 15 మూడు గంటల లోపు టికెట్లను బుక్ చేసుకున్న వారికి తగ్గింపు ధరలకే టికటెట్లు అందిస్తున్నట్లు ఎయిర్ కోస్టా విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. ఈసమయంలో టికెట్లు బుక్ చేసుకుంటే హైదరాబాద్ నుంచి విజయవాడ, బెంగళూరు, చెన్నై, తిరుపతి నగరాలకురూ. 2015, విశాఖపట్నం నుంచి హైదరాబాద్, విజయవాడ, తిరుపతి లకు రూ. 2499, విజయవాడ నుంచి తిరుపతి, విశాఖపట్నం రూ. 2499కే ప్రయాణాలు చేయొచ్చు. మరికొన్ని పట్టణాల మధ్య రూ. 2015 నుంచి రూ. 3499కే ప్రయాణ సౌలభ్యాన్ని కల్పిస్తోంద.ఇ ఈ ఆఫర్ సమయంలో బుక్ చేసుకున్న టికెట్లతో 2015 ఫిబ్రవరి 1 నుంచి 2015 ఏప్రిల్ 15లోపు ఎప్పుడైనా ప్రయాణం చేయొచ్చు. -
జెట్ ఎయిర్వేస్ అన్ని విమానాల్లో 50% వరకు డిస్కౌంట్`
విమానయాన సంస్థల పోటీ పుణ్యమాని ప్రయాణికులకు మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. జెట్ ఎయిర్వేస్ సంస్థ తాజాగా కొత్త ఆఫర్ ప్రవేశపెట్టింది. ఎకానమీతో పాటు ప్రీమియర్ క్లాసు ప్రయాణాలకు, అదికూడా స్వదేశీ, అంతర్జాతీయ ప్రయాణాలు అన్నింటికీ 50 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఆఫర్ కింద అక్టోబర్ 6వ తేదీ వరకు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇలా బుక్ చేసుకున్న వాటిలో నవంబర్ 5వ తేదీ వరకు ప్రయాణించవచ్చు. జెట్ ఎయిర్‌వేస్‌తో పాటు దాని వ్యూహాత్మక భాగస్వామి ఎతిహాద్ ఎయిర్వేస్ నడిపే విమానాల్లో కూడా ఈ డిస్కౌంట్ ఆఫర్ పనిచేస్తుంది. స్వదేశీ విమానాల్లో అయితే బేస్ ఫేర్, ఫ్యూయెల్ ఛార్జీమీద డిస్కౌంట్ వర్తిస్తుంది. అంతర్జాతీయ విమానాల్లో అయితే మాత్రం కేవలం బేస్ ఫేర్ మీద మాత్రమే రాయితీ ఇస్తారు. -
2099కే మలేషియా నుంచి హైదరాబాద్ టికెట్!
విమానాలనే కాదు, విమాన టికెట్ల ధరలను కూడా ఆకాశం నుంచి భూమ్మీదకు దించిన విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా. త్వరలోనే ఈ సంస్థ హైదరాబాద్ నుంచి కూడా తన సేవలను ప్రారంభించబోతోంది. వారంలో అన్ని రోజులూ హైదరాబాద్ నుంచి మలేషియాకు విమానాలు నడిపించనుంది. హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్‌కు డిసెంబర్ 8వ తేదీ నుంచి ఎయిర్ ఏషియా మలేషియా సేవలు ప్రారంభం అవుతాయని ఆ సంస్థ గ్రూప్ సీఈవో టోనీ ఫెర్నాండెజ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. దీని ప్రారంభ ఆఫర్లో.. మొత్తం అన్ని పన్నులు కలుపుకొని కౌలాలంపూర్ నుంచి హైదరాబాద్‌కు కేవలం రూ. 2099కే టికెట్ ఇస్తున్నారు. ఈ ఆఫర్ కింద అక్టోబర్ 5వ తేదీలోగా టికెట్లు బుక్ చేసుకోవాలి. డిసెంబర్ 8వ తేదీ నుంచి 2015 అక్టోబర్ 24వ తేదీ వరకు ప్రయాణాలు చేయొచ్చు. ప్రస్తుతానికి కేవలం బెంగళూరు, చెన్నై, కొచ్చిన్, కోల్‌కతా, తిరుచిరాపల్లి నగరాల నుంచి మాత్రమే ఎయిర్ ఏషియా విమానాలు నడుస్తున్నాయి. -
మళ్లీ చవక ధరలకు విమానయానం
చవక ధరలకే విమానయానం ఇస్తామంటూ కొత్తగా సేవలు ప్రారంభించిన ఎయిర్ ఏషియా ఇండియా సంస్థ మరోసారి ప్రమోషనల్ ఆఫర్లను ప్రకటించింది. గతంలో 339 రూపాయలకే బెంగళూరు - చెన్నై నగరాల మధ్య విమాన యానాన్ని అందించిన ఈ సంస్థ ఇప్పుడు బెంగళూరు-కొచ్చి, బెంగళూరు-చెన్నై నగరాల మధ్య రూ. 1490 చొప్పున, బెంగళూరు-గోవా మధ్య రూ. 1690 చొప్పున ఛార్జీలు నిర్ణయించింది. ఈ టికెట్లను ఈనెల 29వ తేదీలోపు బుక్ చేసుకోవాలి. అంటే, బుకింగ్‌కు వారం రోజుల సమయం ఇచ్చారు. జూలై 1 నుంచి అక్టోబర్ 25వ తేదీ మధ్య ప్రయాణాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. బెంగళూరు-కొచ్చి, బెంగళూరు-గోవా మార్గాల్లో బుక్ చేసుకునే టికెట్ల మీద ఆగస్టు 1 నుంచి అక్టోబర్ 25 వరకు ప్రయాణాలు చేయొచ్చు. -
రేపట్నుంచే ఎయిర్ ఏషియా విమానాలు
చవక ధరలకే విమానయానాన్ని అందించే ఉద్దేశంతో భారతదేశంలో అడుగుపెట్టిన ఎయిర్ ఏషియా ఇండియా విమానాలు గురువారం నుంచి గగన వీధుల్లో ఎగరబోతున్నాయి. బెంగళూరు నుంచి గోవాలోని పనజికి మొదటి విమానం బయల్దేరుతుంది. మే 7వ తేదీన డీజీసీఏ అనుమతి రావడంతో.. దాదాపు నెల రోజుల తర్వాత ఈ సంస్థ విమానాలు వినువీధిలోకి ప్రవేశిస్తున్నాయి. తమ మొదటి ఎయిర్‌బస్ ఎ-320 విమానంలో మొత్తం 180 సీట్లు బుకింగ్ ప్రారంభించిన పది నిమిషాల్లోనే అమ్ముడుపోయాయని ఎయిరేషియా అధికార ప్రతినిధి తెలిపారు. బెంగళూరు -గోవా మార్గంలో ప్రారంభ ఆఫర్‌గా మొత్తం ఛార్జీని 990 రూపాయలుగా నిర్ణయించారు. అలాగే చెన్నై-బెంగళూరు, బెంగళూరు-చెన్నై మార్గాల్లో అయితే మరింత తక్కువగా ఛార్జీలున్నాయి. మిగిలిన రోజుల్లో ఈ ఆఫర్ లేనప్పుడు కూడా తమ ఛార్జీలు మార్కెట్ రేటుతో పోలిస్తే 35 శాతం తక్కువగానే ఉంటాయని ఎయిరేషియా ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ మిట్టు శాండిల్య తెలిపారు. -
339 రూపాయలకే విమాన టికెట్!!
చెన్నై నుంచి బెంగళూరు వెళ్లాలంటే ఎంత ఖర్చువుతుంది? రైల్లో వెళ్తే స్లీపర్ క్లాస్ అయితే 230 రూపాయల నుంచి ఫస్ట్ క్లాస్ ఏసీ అయితే 1360 రూపాయల వరకు అవుతుంది. ప్రయాణ సమయం కూడా సూపర్ ఫాస్ట్ రైలు అయితే.. అది కూడా రైలు ఆలస్యం కాకపోతే కనీసం ఆరు గంటలు పడుతుంది. అదే మీరు విమానం ఎక్కితే జస్ట్ 339 రూపాయలు చెల్లిస్తే చాలు.. ప్రశాంతంగా కూర్చుని హాయిగా అరగంటలోనో గంటలోనో వెళ్లిపోవచ్చు. ఏంటి, దీనిక అదనంగా పన్నులు ఉంటాయిలే అనుకుంటున్నారా? ఒక్క పైసా కూడా మీరు అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు. 339 రూపాయలిచ్చి చెన్నై నుంచి బెంగళూరుకు విమానంలో వెళ్లిపోవచ్చు. అదే బెంగళూరు నుంచి చెన్నైకి మాత్రం టికెట్ ధర 490 రూపాయలు. తక్కువ ఖరీదుతో విమానయానాన్ని అందించాలని తలపెట్టిన ఎయిర్ ఏషియా ఇండియా సంస్థ ఈ సరికొత్త ఆఫర్‌తో తన సేవలు ప్రారంభించింది. ఒక్కో రూటుకు ఒక్కో ధరను ఈ సంస్థ నిర్ణయించింది. బెంగళూరు నుంచి గోవా వెళ్లాలంటే పన్నులతో కలిపి 990 రూపాయలు చెల్లించాలి. శుక్రవారం ఉదయం 9.30 గంటల నుంచి టికెట్ బుకింగ్ మొదలైపోయింది. ఇప్పటికే చాలావరకు టికెట్లు అయిపోయాయి కూడా. కొన్ని తేదీలకు మాత్రం ఇంకా మిగిలే ఉన్నాయి. అయితే, హైదరాబాద్ నుంచి మాత్రం ఈ విమానయాన సంస్థ సర్వీసులు ఇంకా ప్రారంభం కాలేదు. అందువల్ల దేశంలోని మిగిలిన నగరాలకు సంబంధించి మాత్రమే టికట్లు బుక్ చేసుకోవచ్చు. మే 30 నుంచి జూన్ 1వ తేదీ వరకు మాత్రమే ఈ బుకింగ్ ఆఫర్ అమలులో ఉంటుంది. ప్రయాణం మాత్రం జూన్ 12 నుంచి అక్టోబర్ 15 వరకు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. మలేషియా విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా, టాటా సన్స్, టెలెస్ట్రా ట్రేడ్‌ప్లేస్.. ఇవన్నీ కలిసి సంయుక్తంగా ప్రారంభించిన ఎయిర్ ఏషియా ఇండియా సంస్థకు డీసీసీఏ నుంచి ఫ్లయింగ్ లైసెన్స్ అంత సులభంగా దొరకలేదు. ఎట్టకేలకు తొమ్మిది నెలలు వేచి ఉన్న తర్వాత పలు అడ్డంకులు అధిగమించి ఇప్పుడు గాల్లో ఎగరబోతోంది.