చైనా ఫోన్లే కాదు.. విమానాలూ చౌకే!
Published Mon, Dec 26 2016 9:34 AM | Last Updated on Mon, Sep 4 2017 11:35 PM
విదేశాలకు వెళ్లడానికి చార్జీలు ఎక్కువగా ఉన్నాయని బాధపడుతున్నారా? ప్రముఖ విమానయాన సంస్థలు అప్పుడప్పుడు ఆఫర్లు ప్రకటించినా, అవన్నీ స్వదేశీ విమానయానానికే చాలావరకు పరిమితం అవుతున్నాయి. కొన్ని మాత్రం విదేశాలకు ఆఫర్లు ఇస్తున్నా, అవన్నీ దగ్గర దేశాలకే. దూర ప్రాంతాలకు వెళ్లాలంటే మాత్రం టికెట్ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని బాధపడేవారికి ఇదో అవకాశం. చైనా సదరన్ ఎయిర్‌లైన్స్ వాళ్లు చాలావరకు చవగ్గా విమానయానాలు అందిస్తున్నారట. ఢిల్లీ నుంచి లాస్ ఏంజెలిస్ వెళ్లడానికి ఇతర ఎయిర్‌లైన్స్ సంస్థలు రూ. 65వేలు టికెట్ తీసుకుంటే, చైనా సదరన్ ఎయిర్‌లైన్స్ (సీఎస్‌ఏ) టికెట్ 58వేలు మాత్రమే ఉందట. ఒక్క అమెరికాకే కాదు.. భారతదేశం, మధ్యప్రాచ్యం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్.. ఇలా చాలా దేశాలకు తక్కువ ధరలకే టికెట్లు ఆఫర్ చేస్తోంది. దాంతో భారతీయ ప్రయాణికులు ఇప్పుడు చైనా ఫోన్లతో పాటు చవగ్గా వస్తున్న చైనా విమానటికెట్ల వైపు కూడా మొగ్గు చూపుతున్నారు.
భారత్ నుంచి ఈ విమానాల్లో వెళ్లేవారి సంఖ్య ఇటీవల కొన్నేళ్ల నుంచి బాగా పెరిగిందని థామస్ కుక్ సంస్థ ప్రెసిడెంట్ ఇందీవర్ రస్తోగీ చెప్పారు. చవగ్గా టికెట్లు ఇస్తున్నాం కదాని విమానాలు కూడా చౌకబారుగా ఉంటాయనుకుంటే తప్పే. వాటిలో సౌకర్యాలు కూడా బాగానే ఉంటున్నాయట. దూర ప్రాంతాలకు వెళ్లడానికి టికెట్ల ధరలు సింగపూర్ ఎయిర్‌లైన్స్, థాయ్ ఎయిర్‌వేస్, మలేసియన్ ఎయిర్‌లైన్స్ కంటే ఇందులో కనీసం 20 నుంచి 25 వేల వరకు ఇందులో తక్కువగా ఉంటున్నాయని రస్తోగీ చెప్పారు.
అయితే, భారతీయ మార్కెట్లోకి నేరుగా ప్రవేశించే అవకాశం వీళ్లకు మరీ ఎక్కువగా లేకపోవడంతో ఎయిరిండియా సహా పలు భారతీయ ఎయిర్‌లైన్స్ బతికిపోతున్నాయి. వారానికి 42 విమానాల్లో 10వేల సీట్లు మాత్రమే అమ్ముకోడానికి వీలు కల్పించేలా ఇండియా - చైనాల మధ్య విమానయానానికి సంబంధించి ఒక ద్వైపాక్షిక ఒప్పందం ఉంది. దీన్ని చైనా సంస్థలు పూర్తిగా వాడుకుంటుండగా, భారతదేశం మాత్రం కేవలం 5 విమానాలే నడిపిస్తూ 1280 సీట్లు మాత్రమే అమ్ముకుంటోంది.
ధరల్లో తేడాలు ఇలా ఉన్నాయి..
ఢిల్లీ-సిడ్నీ:
చైనా సదరన్ (సీఎస్): రూ. 44,500 (వయా గువాంగ్జు)
ఎయిరిండియా: రూ. 69వేలు (డైరెక్ట్)
ఢిల్లీ-ఆక్లండ్:
సీఎస్: రూ. 48,900 (వయా గువాంగ్జు)
ఎయిరిండియా: రూ. 68,400 (వయా సిడ్నీ)
ఎంఎ: రూ. 70,500 (వయా కౌలాలంపూర్)
ఢిల్లీ-టోక్యో
సీఎస్: రూ. 34,000 (వయా గువాంగ్జు)
ఏఎన్ఏ : రూ. 39,400
థాయ్: రూ. 42,000 (వయా బ్యాంకాక్)
ఢిల్లీ-శాన్ ఫ్రాన్సిస్కో:
సీఎస్: రూ. 60,300 (వయా గువాంగ్జు)
గల్ఫ్ విమానాలు: ప్రారంభం రూ. 72 వేలు
Advertisement
Advertisement