
విమానంలో చెలరేగిన మంటలు.. ఆర్పుతున్న సిబ్బంది
బీజింగ్: టేకాఫ్ కు సిద్దంగా ఉన్న ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. సెల్‌ఫోన్ చార్జింగ్ కు వాడే పవర్ బ్యాంకు పేలడంతో చైనా సదరన్ ఎయిర్‌లైస్స్ కు చెందిన విమానంలో మంటలు చెలరేగాయి. సిబ్బంది, ప్రయాణికులు సకాలంలో మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. చైనాలోని గాంగ్‌జూ విమానాశ్రయంలో ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. బోయింగ్ 777-300ఈఆర్ రకానికి చెందిన సీజెడ్3539 విమానం గాంగ్జూ నుంచి షాంఘై వెళ్లేందుకు సిద్ధమైంది. ప్రయాణికులు విమానంలో ఎక్కుతుండగానే ఓవర్‌హెడ్ కంపార్ట్‌మెంటులో మంటలు గమనించారు. అందులోని ఓ బ్యాగులో నుంచి మంటలు చెలరేగాయి. సిబ్బంది హుటాహుటిన స్పందించి మంటలు ఆర్పివేశారు.
ప్రమాదం జరిగినప్పుడు పవర్ బ్యాంకు వినియోగంలో లేకపోయినా ఎందుకు పేలిందనే దానిపై అధికారులు విచారణ ప్రారంభించారు. ఆ బ్యాగు తీసుకువచ్చిన వ్యక్తిని విచారిస్తున్నారు. ఈ ఘటనతో ఆ విమానాన్ని నిలిపివేసి మరో విమానంలో ప్రయాణికులను పంపించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీకాలేదు. బోయింగ్ 777-300ఈఆర్ విమానంలో కొంత భాగం మాత్రం పాడైంది. మంటలు చెలరేగినప్పుడు ప్రయాణికుడు తీసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment