చెత్తబుట్టల వాడకం చాలాకాలంగా ఉన్నదే! పర్యావరణ స్పృహ పెరిగిన తర్వాత చాలా ప్రాంతాల్లో తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకరమైన చెత్తలకు వేర్వేరు చెత్త బుట్టలను స్థానిక సంస్థలు వేర్వేరు రంగులతో ఏర్పాటు చేయడాన్ని చూస్తూనే ఉన్నాం. అవగాహనలేని కొందరు వీటిలో ఒకదానిలో వేయాల్సిన చెత్తను వేరేదానిలో వేసేస్తూ ఉంటారు.
రంగులను బట్టి గందరగోళానికి లోనవకుండా, ఎందులో వేయాల్సిన చెత్తను అందులోనే వేసేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే చెత్తబుట్టలను ఇటీవల అమెరికన్ శాస్త్రవేత్తలు రూపొందించారు. వీటిని ప్రయోగాత్మకంగా అమెరికాలోని సీటల్–టకోమా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాటు చేశారు.
చెత్తబుట్టల్లో వేయడానికి తీసుకొచ్చే చెత్తను వీటిపై ఉండే కెమెరాలు స్కాన్ చేసి, అది ఎందులో వేయాల్సినదో నిర్ధారిస్తుంది. వీటిలోని సెన్సర్లు చెత్తకు అనుగుణమైన బుట్ట మూత తెరుచుకునేలా చేస్తాయి. ఇలాంటి చెత్తబుట్టలు ప్రతిచోటా వాడుకలోకి వస్తే, రకరకాలు చెత్తలన్నీ కలగాపులగం కాకుండా, వాటి వల్ల తర్వాత ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుంది.
సోలార్ పవర్‌బ్యాంక్..
సౌర విద్యుత్తు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ, విశాలమైన స్థలంలేని చోట సోలార్ ప్యానెల్స్, పవర్‌బ్యాంక్ ఏర్పాటు చేసుకోవడం సాధ్యం కాదు. అయితే, చిన్న చిన్న అపార్ట్‌మెంట్లలో కూడా సులువుగా అమర్చుకునే సోలార్ పవర్‌బ్యాంక్‌ను చైనా కంపెనీ ‘యాంకర్ ఇనవేషన్స్ రూపొందించింది.
‘యాంకర్ సోలార్ బ్యాంక్ 2 ఈ1600 ప్రో’ పేరుతో రూపొందించిన ఈ సోలార్ పవర్ బ్యాంకును బాల్కనీ చోటులో తేలికగా అమర్చుకోవచ్చు. ఇది సూర్యకాంతిని విద్యుత్తుగా మార్చి, బ్యాటరీలో నిక్షిప్తం చేస్తుంది. ఇందులో లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీని అమర్చారు.
ఈ బ్యాటరీ పూర్తిగా చార్జ్ అయినట్లయితే, సూర్యకాంతి లేకపోయినా, నిరంతరాయంగా పదిహేను గంటల సేపు ఇంటికి సరిపోయేంత విద్యుత్తును సరఫరా చేస్తుంది. దీనికి వైఫై, బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉండటంతో యాప్ ద్వారా కూడా దీనిని అవసరాలకు తగినట్లుగా ఉపయోగించుకోవచ్చు. దీని ధర అంతర్జాతీయ మార్కెట్‌లో 850 యూరోలు (రూ.76,030) మాత్రమే!
ఎలక్ట్రిక్ ట్రాక్టర్..
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే విద్యుత్ వాహనాల వినియోగం బాగా పుంజుకుంటోంది. తాజాగా భారత శాస్త్ర సాంకేతిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్), సెంట్రల్ మెకానికల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ సంస్థలు సంయుక్తంగా దేశంలోని తొలి ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ను రూపొందించాయి. ఇది లిథియం అయాన్ ప్రిస్మాటిక్ సెల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది.
బ్యాటరీ ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్తుతో ఈ ట్రాక్టర్ ఇంజిన్ 13 హార్స్‌పవర్ సామర్థ్యంతో పనిచేస్తుంది. చిన్న పొలాలు, తోటలకు అనుకూలంగా ఉండేలా దీనిని తయారు చేశారు. దీనికి రిడ్జర్స్, కల్టివేటర్స్, ఇనుప చక్రాలు, నాగలి ములుకులు వంటి వ్యవసాయ పరికరాలను అవసరం మేరకు అమర్చుకోవచ్చు. సన్నకారు, చిన్నకారు రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని దీనిని రూపొందించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని ధర రూ.9.25 లక్షలు మాత్రమే!
Comments
Please login to add a commentAdd a comment