ప్రపంచంలో అతిపెద్ద చౌక ఎయిర్‌లైన్స్ కూటమి!
‘వేల్యూ అలయెన్స్’ టేకాఫ్...
సింగపూర్: చౌక విమానయాన సేవలకు అంతకంతకూ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో... ప్రపంచంలోనే అతిపెద్ద బడ్జెట్ ఎయిర్‌లైన్స్ కూటమి(అలయెన్స్) ఆవిర్భవించింది. ఆగ్నేయాసియా, జపాన్, ఆస్ట్రేలియాలకు చెందిన ఎనిమిది బడ్జెట్ ఎయిర్‌లైన్స్ కలిసి ‘వేల్యూ అలయెన్స్’ పేరుతో దీన్ని ఏర్పాటు చేసుకున్నట్లు సోమవారమిక్కడ ప్రకటించాయి. ఈ విమానయాన కంపెనీలకు చెందిన టికెటింగ్ ప్లాట్‌ఫామ్ షేరింగ్ ద్వారా ప్రయాణికులు ఎక్కడి నుంచి ఎక్కడికైనా టికెట్లను బుక్ చేసుకోవడాకి వీలుకల్పించనుండటం ఈ అలయెన్స్ ప్రత్యేకత.
అంటే.. ఈ ఎనిమిది కంపెనీలకు చెందిన ఏ వెబ్‌సైట్ ద్వారానైనా అన్ని సంస్థల ఫ్లైట్లు, టారిఫ్‌లు, ఇతరత్రా వివరాలన్నీ తెలుసుకోవచ్చు. అంతేకాకుండా.. సంబంధిత వెట్‌సైట్ ద్వారా ఒకే లావాదేవీతో టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని వేల్యూ అలయెన్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రపంచంలోనే అతిపెద్ద చౌక విమానయాన సంస్థల కూటమిగా దీన్ని అభివర్ణించింది. అలయెన్స్‌లో సింగపూర్ ఎయిర్‌లైన్స్ అనుబంధ సంస్థ ‘స్కూట్’, ఫిలిప్పైన్స్‌కు చెందిన సెబు ఫసిఫిక్, దక్షిణ కొరియా జేజు ఎయిర్, థాయ్‌లాండ్ నోక్ ఎయిర్, నోక్‌స్కూట్; టైగర్ ఎయిర్ సింగపూర్, టైగర్ ఎయిర్ ఆస్ట్రేలియా, జపాన్ సంస్థ వెనీలా ఎయిర్‌లు ఉన్నాయి.
ఈ అలయెన్స్‌లో మొత్తం విమానాల సంఖ్య 176 కాగా, 160 గమ్య స్థానానాలకు సర్వీసులను అందించనుంది. గతేడాది ఈ కూటమి సభ్య కంపెనీలు 17 ప్రధాన కేంద్రాల(హబ్స్) ద్వారా 4.7 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించింది. ఆగ్నేయాసియాలో అతిపెద్ద బడ్జెట్ ఎయిర్‌లైన్స్ ఎయిర్‌ఏషియా, ఆస్ట్రేలియా కాంటాస్ ఎయిర్‌వేస్, భారత్ చౌక విమానయాన దిగ్గజం ఇండిగోలు ఈ అలయెన్స్‌కు దూరంగా ఉన్నాయి.