ఆలస్యం అయ్యిందో.. జీతం కట్!
ఇటీవలి కాలంలో ఎయిరిండియా విమానాలు తెగ ఆలస్యం అవుతున్నాయి. దీనిపై ఎయిర్ ఇండియా ఆగ్రహం వ్యక్తం చేసింది. సిబ్బంది విధులకు ఆలస్యంగా రావడమే ఇందుకు కారణమని గుర్తించి, ఇకమీదట అలా ఆలస్యంగా వస్తే జీతాల్లో కోత పెడతామని హెచ్చరించింది. ఈనెల 1 నుంచి వీటిని అమలు చేస్తోంది. ఈ ఆదేశాలను పౌరవిమానయాన రంగం ప్రధాన కార్యదర్శి సోమసుందరన్ జారీ చేశారు.
ఈ ఆదేశాలు పైలట్లకు, కేబిన్ సిబ్బంది, ఇంజనీరింగ్ స్టాఫ్కు వర్తిస్తుందని ఆయన తెలిపారు. ఆఖరికి క్యాటరింగ్ చేసే వారి వల్ల కూడా ఆలస్యం అవకూడదని నిబంధనలు విధించారు. సిబ్బందిలో ఎవరికి జీతాలు ఇవ్వాలన్నా.. ఆలస్యానికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు లేవని తెలిసిన తర్వాతే ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానయాన సంస్థల్లో ఎయిరిండియా విమానాలే ఎక్కువగా ఆలస్యం అవుతున్నాయని సోమసుందరన్ ఇటీవల తెలిపారు.
ఎయిర్ పోర్టుల వద్దనే ఉద్యోగుల హాజరును బయోమెట్రిక్ విధానంలో తీసుకోవాలని నిర్ణయించారు. ఇప్పటికే ముంబై, ఢిల్లీ ఎయిర్ పోర్టుల్లో బయోమెట్రిక్ విధానాన్ని ఉంచామని ఎయిర్ ఇండియా కార్యదర్శి అన్నారు. అన్ని ఎయిర్ పోర్టులకూ దీన్ని అమలు చేయనున్నారు. అయితే.. ఈ నిబంధనలను సీనియర్ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ప్రభుత్వం ఎయిర్ ఇండియా ఉద్యోగుల పరిస్థితులను అర్థం చేసుకోవాలన్నారు. ప్రయాణంలో అనుకోకుండా ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుందని వారు ఎయిర్ ఇండియా బోర్డుకు తెలిపారు. విమానాల ఆలస్యానికి కేబిన్ సిబ్బంది కొరతే 80 శాతం కారణం అవుతుందని వారు ఈ సందర్భంగా తెలిపారు. సమయానికి విమానాలు రాకపోతే జీతాల్లో కోత ఉండటం సమంజసం కాదన్నారు.